ముంబై, అక్టోబర్ 16 : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలుండటం, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు మదుపరుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఫలితంగా కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో ఇరు సూచీలు ఒక్క శాతానికి పైగా లాభపడ్డాయి. ఇంట్రాడేలో వెయ్యి పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 862 పాయింట్లు అందుకొని 83,467.66 వద్ద నిలిలిచింది. మరో సూచీ నిఫ్టీ 261.75 పాయింట్లు లేదా 1.03 శాతం బలపడి 25,585.30 వద్ద స్థిరపడింది.
వరుసగా రెండు రోజులుగా స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడటంతో మదుపరులు సంపద అమాంతం పెరిగింది. గత రెండు సెషన్లలోనే రూ.6 లక్షల కోట్ల సంపదను పోగేశారు. రెండు రోజుల్లో సెన్సెక్స్ 1,500 పాయింట్లకు పైగా లాభపడటంతో బీఎస్ఈలో లిైస్టెన సంస్థల విలువ రూ.466 లక్షల కోట్లకు చేరుకున్నది. ఈ నెల 14న రూ.460 లక్షల కోట్లుగా ఉన్న కార్పొరేట్ల మార్కెట్ విలువ గత రెండు సెషన్లలోనే రూ.6 లక్షల కోట్లకు పైగా ఎగబాకింది.