గడిచిన నెల రోజులకుపైగా యావత్తు ప్రపంచ మార్కెట్లను కుదిపేసిన గల్ఫ్ ఉద్రిక్తతలు ఎట్టకేలకు సద్దుమణిగాయి.
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో అగ్ని గుండంగా మారిన పశ్చిమాసియాలో కాల్పుల విరమణతో తిరిగి శాంతియుత వాతావరణం నెలకొనడానికి మార్గం సుగమమైంది. ముఖ్యంగా భారత్ సహా చాలా దేశాలకు చమురు కష్టాలు తొలగినైట్టెంది.
ఫలితంగా ఇన్నాళ్లూ తీవ్ర ఒడిదుడుకులకు లోనైన స్టాక్, కరెన్సీ మార్కెట్లు మళ్లీ లాభాలను సంతరించుకున్నాయి. దేశీయంగా ఈక్విటీ మార్కెట్ మదుపర్ల సంపద ఒక్కరోజే లక్షల కోట్ల రూపాయల్లో పుంజుకోగా.. డాలర్‌తో పోల్చితే రూపీ వాల్యూ 52 పైసలు ఎగిసింది. ఇక తాజా ద్రవ్య సమీక్షలో ఆర్బీఐ సైతం వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచడం మరింత ఉత్సాహాన్నిచ్చింది.
ముంబై, ఏప్రిల్ 8 : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఈ ఒక్కరోజే దాదాపు 4 శాతం పుంజుకున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ కాల్పుల విరమణ, ద్రవ్యోల్బణ భయాల నేపథ్యంలో ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచడం.. మార్కెట్ సెంటిమెంట్‌ను బలపర్చాయి. అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, తగ్గుముఖం పట్టిన ముడి చమురు ధరలు, పెరిగిన రూపీ వాల్యూ సైతం మదుపర్లను పెట్టుబడుల దిశగా నడిపించాయి. దాదాపు అన్ని రంగాల షేర్లకు కొనుగోలు మద్దతు లభించింది. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 2,946.32 పాయింట్లు లేదా 3.95 శాతం ఎగబాకి 77,562.90 వద్ద ముగిసింది. దీంతో వరుసగా ఐదో రోజు లాభాలను అందుకున్నైట్టెంది. ఒకానొక దశలోనైతే 3,018.96 పాయింట్లు కోలుకున్నది. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 873.70 పాయింట్లు లేదా 3.78 శాతం ఎగిసి 23,997.35 వద్ద నిలిచింది. ఇంట్రా-డేలో 901.5 పాయింట్లు పుంజుకున్నది.
అంతర్జాతీయ మార్కెట్లో పరుగులు పెడుతున్న ముడి చమురు ధరలతో దాదాపు 40 రోజులపాటు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న విమానయాన, చమురు రంగాల షేర్లకు.. మళ్లీ గిరాకీ వచ్చింది. ఇండిగో మాతృ సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేర్ విలువ 8.16 శాతం లాభపడి బీఎస్ఈలో 4,616.60 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 10.98 శాతం ఎగిసింది. స్పైస్‌జెట్ షేర్ కూడా 5 శాతం లాభపడింది. మరోవైపు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ హెచ్‌పీసీఎల్ షేర్ విలువ 9.93 శాతం పుంజుకొని బీఎస్ఈలో రూ.354.30 వద్ద నిలిచింది. అలాగే సర్కారీ సంస్థలైన బీపీసీఎల్, ఇండియన్ ఆయిల్ షేర్లూ 7.44 శాతం, 6.62 శాతం చొప్పున పెరిగాయి. ఏషియన్ పెయింట్స్, ఇండిగో పెయింట్స్, నెరోలాక్, బర్జర్ పెయింట్స్ షేర్లూ లాభాలను అందుకున్నాయి. ఇక అదానీ గ్రూప్ షేర్లకూ డిమాండ్ కనిపించింది. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్ మోసం కేసులో గౌతమ్ అదానీ విజ్ఞప్తికి అనుకూలంగా అమెరికా కోర్టు స్పందించడమే కారణం. ఈ క్రమంలోనే అదానీ గ్రీన్ 11.38 శాతం, అదానీ ఎనర్జీ 8.78 శాతం, అదానీ ఎంటర్ప్రైజెస్ 8.62 శాతం, అదానీ టోటల్ గ్యాస్ 7.60 శాతం, ఎన్డీటీవీ 6.48 శాతం, అంబుజా సిమెంట్స్ 6.28 శాతం, అదానీ పోర్ట్స్ 5.28 శాతం, ఏసీసీ 5.20 శాతం, అదానీ పవర్ 3.55 శాతం మేర పెరిగాయి.
స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగియడంతో మదుపర్ల సంపద కూడా అంతే స్థాయిలో ఎగిసింది. ఈ ఒక్కరోజే బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ మునుపెన్నడూ లేనివిధంగా రూ.16,25,093.09 కోట్లు పెరిగి రూ. 4,45,51,401.85 కోట్లకు చేరింది. ఆ రంగం.. ఈ రంగం అన్న తేడా లేకుండా అన్ని రంగాల షేర్లను మదుపర్లు ఎగబడి కొనేశారు. దీంతో బీఎస్ఈ లార్జ్, మిడ్, స్మాల్‌క్యాప్ సూచీలన్నీ పరుగులు పెట్టాయి. రిటైల్ మదుపర్లతోపాటు, దేశీయ సంస్థాగత మదుపర్లు పెట్టుబడులకు పెద్దపీట వేశారు.
గల్ఫ్ ఉద్రిక్తతలు సద్దుమణగడం
ముడి చమురు ధరలు తగ్గడం
గ్లోబల్ స్టాక్ మార్కెట్ల ర్యాలీ
ఆర్బీఐ రెపోరేటు యథాతథం
పెరిగిన రూపాయి మారకం విలువ
మదుపర్లలో కొనుగోలు ఉత్సాహం
అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలికంగా జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంతో అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో పరుగులు పెట్టాయి. భారతీయ ఈక్విటీలూ అదే దారిని అనుసరించాయి. ద్రవ్యోల్బణం, వృద్ధిరేటు భయాలను తగ్గుముఖం పట్టిన ముడి చమురు ధరలు తొలగించాయి. ఆర్బీఐ వడ్డీరేట్ల జోలికి వెళ్లకపోవడం కూడా కలిసొచ్చింది.
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో ఏర్పడిన సంక్షోభం.. కాల్పుల విరమణతో తొలగిపోయింది. ముఖ్యంగా హొర్ముజ్ జలసంధి తెరుచుకోవడం, గ్లోబల్ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ రేటు 100 డాలర్ల దిగువకు చేరడం.. భారత్‌కు వెంటనే లాభించే అంశాలు. రెపోరేటు యథాతథం కూడా ఉత్సాహాన్నిచ్చింది.
-వినోద్ నాయర్, జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్
ముంబై: అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు.. దేశీయంగా రూపాయి పతనం, ద్రవ్యోల్బణం నేపథ్యంలో బుధవారం జరిగిన ఈ ఆర్థిక సంవత్సరం (2026-27) తొలి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీరేట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) యథాతథంగానే ఉంచింది. ఆరుగురు సభ్యులున్న మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) రెపోరేటును 5.25 శాతం వద్దే ఉంచాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో ఏర్పడిన ఉద్రిక్తతలు.. ముడి చమురు రవాణాకు తీవ్ర అంతరాయం కలిగించిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితి అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరల్ని ఎగదోయడమేగాక.. దేశంలో ద్రవ్యోల్బణానికి, వృద్ధిరేటు పతనానికి దారితీశాయి. ఈ క్రమంలోనే వేచిచూసే ధోరణిని ఆర్బీఐ అవలంబించింది. కాగా, పాలసీ ప్రకటనకు కొద్ది గంటల ముందు వచ్చిన అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ వార్తల్నీ.. పరిగణనలోకి తీసుకునే ద్రవ్య సమీక్ష నిర్ణయాలను వెల్లడించామని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ద్రవ్య సమీక్ష అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను దేశ జీడీపీ వృద్ధిరేటును 6.9 శాతంగా ఆర్బీఐ అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం (2025-26) అంచనా 7.6 శాతం కంటే ఇది తక్కువే కావడం గమనార్హం. పెరుగుతున్న వస్తూత్పత్తుల ధరలు, సరఫరా ఇబ్బందులకు ఇది అద్దం పడుతున్నది. కాగా, ప్రధాన సముద్ర మార్గాల్లో అవాంతరాలు, రవాణా ఖర్చులు, బీమా భారం వల్ల దేశీయ ఎగుమతులు పడిపోయే వీలుందని గవర్నర్ మల్హోత్రా అన్నారు. పశ్చిమాసియా సంక్షోభం ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై ఉండవచ్చన్నారు.
ఇప్పట్లో వడ్డీరేట్లు పెరుగకపోవచ్చని, మరికొంత కాలం ఇదే స్థాయిలోనే రెపోరేటు ఉండే అవకాశాలున్నాయని మల్హోత్రా అనడం విశేషం. ధరలు ఇప్పటికీ ఆర్బీఐ ఆమోదయోగ్య స్థాయిలోనే ఉన్నాయి. ఇక ఈ ఆర్థిక సంవత్సరం రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4.6 శాతంగా ఆర్బీఐ అంచనా వేసింది.