Market Pulse | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాలబారిన పడుతున్నాయి. మదుపరులు లాభాల స్వీకరణకే మొగ్గు చూపుతున్నారు. శుక్రవారం ఒక్కరోజే సెన్సెక్స్ 1,017, నిఫ్టీ 293 పాయింట్లు పతనమయ్యాయి. ఈ క్రమంలోనే గత వారం సూచీలు భారీ ఎత్తున క్షీణించాయి. అంతకుముందు వారం ముగింపుతో చూస్తే బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,181.84 పాయింట్లు దిగజారి 81,183.93 వద్ద నిలిచింది. అలాగే ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ సైతం 383.75 పాయింట్లు కోల్పోయి 24,852.15 దగ్గర ముగిసింది. మార్కెట్లు నూతన గరిష్ఠాల వద్ద ఉండటంతో ఇన్వెస్టర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నారు. ఈ వారం కూడా సెల్లింగ్ ప్రెషర్ కొనసాగవచ్చని మెజారిటీ నిపుణుల అభిప్రాయం.
గ్లోబల్ స్టాక్ మార్కెట్లు, విదేశీ సంస్థాగత మదుపరుల పెట్టుబడులు, అంతర్జాతీయ పరిణామాలు, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ఈ వారం కూడా భారతీయ స్టాక్ మార్కెట్ల తీరును నిర్దేశించనున్నాయి. ఇక అమ్మకాల ఒత్తిడి ఎదురైతే నిఫ్టీకి 24,500 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 24,300 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం 25,300-25,500 మధ్యకు నిఫ్టీ వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు.
స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్‌ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఒడిదొడుకులు చాలా సహజం. పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహాలు, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. పైన పేర్కొన్న సూచనలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే పూర్తి బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్ పల్స్.