న్యూఢిల్లీ, జూన్ 16: అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ స్టాక్ మార్కెట్లో ప్రకంపనలు సృష్టించింది. ద్రవ్యోల్బణాన్ని అదుపుచేయడానికి ఫెడ్..వడ్డీ రేట్లను ఏకంగా 75 బేసిస్ పాయింట్లను (0.75 శాతం) పెంచడంతో పాటు ఈ ఏడాది మరింత పెంపు సంకేతాల్ని ఇవ్వడంతో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఈ ట్రెండ్‌ను ప్రతిబింబిస్తూ గురువారం భారత్ స్టాక్ సూచీలు కుదేలయ్యాయి. ఏడాది కనిష్టానికి పతనమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1,045 పాయింట్లు క్షీణించి 51,496 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 331 పాయింట్లు పడిపోయి 15,361 పాయింట్ల వద్ద ముగిసాయి. సూచీలు ఈ స్థాయిలో ముగియడం 12 నెలల్లో ఇదే ప్రథమం.
అన్ని రంగాలూ నష్టాల్లోనే
సెన్సెక్స్-30 షేర్లలో నెస్లే ఇండియా మినహా మిగిలిన షేర్లన్నీ నష్టాల్ని మూటకట్టుకున్నాయి. మార్కెట్ పతనాల్లో రక్షణాత్మంగా ఉండే ఎఫ్ఎంసీజీ, ఫార్మాతో సహా అన్ని రంగాల సూచీలు పడిపోయాయి. అన్నింటికంటే అధికంగా బీఎస్ఈ మెటల్ ఇండెక్స్ 5.48 శాతం తీవ్ర నష్టాల పాలయ్యింది. బేసిక్ మెటీరియల్స్ ఇండెక్స్ 3.55 శాతం, ఇండస్ట్రియల్స్ సూచి 3.06 శాతం చొప్పున తగ్గాయి.
యూరప్ కేంద్ర బ్యాంక్‌ల పోటు
ఫెడ్‌కు తోడుగా బ్రిటన్‌లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ పావుశాతం వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించగా, 15 సంవత్సరాల్లో మొదటిసారిగా స్విట్జర్లాండ్‌కు చెందిన స్విస్ నేషనల్ బ్యాంక్ పాలసీ రేటును పెంచింది. ఈ వార్తలతో యూరప్ సూచీలు నిలువునా పతనంకావడం సైతం భారత్ మార్కెట్‌పై ప్రభావం చూపింది. యూరప్‌లో ప్రధాన సూచీలైన బ్రిటన్ ఎఫ్టీఎస్ఈ, జర్మనీ డాక్స్, ఫ్రాన్స్ కాక్‌లు 2-3 శాతం మధ్య పడిపోయాయి.
రూ.15.74 లక్షల కోట్ల ఆవిరి
తాజా మార్కెట్ పతనంతో ఇన్వెస్టర్లు ఒక్కరోజులోనే రూ.5.54 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. బీఎస్ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.2,39,20,631 కోట్లకు తగ్గింది. ఐదు రోజుల వరుస పతనాలతో ఈక్విటీ ఇన్వెస్టర్ల సంపద రూ.15.74 లక్షల కోట్ల మేర హరించుకుపోయింది. గడిచిన ఐదు రోజుల్లో సెన్సెక్స్ 3,824 పాయింట్లు నష్టపోయింది.