ముంబై, ఫిబ్రవరి 8: వరుస నష్టాల నుంచి మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. మూడు రోజులుగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్న సూచీలు.. ఎట్టకేలకు కొనుగోళ్ల మద్దతును అందుకున్నాయి. దీంతో బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 187.39 పాయింట్లు లేదా 0.33 శాతం పుంజుకుని 57,808.58 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ సైతం 53.15 పాయింట్లు లేదా 0.31 శాతం లాభపడి 17,266.75 వద్ద నిలిచింది. ఎనర్జీ, మెటల్, ఫైనాన్స్ రంగాల షేర్లు మదుపరులను ఆకర్షించాయని ట్రేడింగ్ సరళిని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
టాటా స్టీల్ ఆకర్షణీయం
టాటా స్టీల్ షేర్ విలువ అత్యధికంగా 3.10 శాతం ఎగబాకింది. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టైటాన్, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లూ లాభపడాయి. అయితే పవర్‌గ్రిడ్, టీసీఎస్, అల్ట్రాటెక్ సిమెంట్, టెక్ మహీంద్రా, కొటక్ బ్యాంక్, ఎల్అండ్టీ, హెచ్డీఎఫ్సీ ద్వయం 1.66 శాతం మేర నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలూ 1.40 శాతం మేర క్షీణించాయి. ఆసియా మార్కెట్లలో జపాన్, చైనా, దక్షిణ కొరియా సూచీలు లాభాల్లో, హాంకాంగ్ సూచీ నష్టాల్లో ముగిసింది.