Stock Markets : భారత స్టాక్ మార్కెట్ (Stock Markets) సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఇరాన్ (Iran) తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించినప్పటికీ.. శాంతి చర్చల అంశం ఇంకా కొలిక్కి రాకపోవడం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీనికితోడు గరిష్ఠ స్థాయిలో క్రూడాయిల్ ధరలు కొనసాగుతుండటం, ఇటీవల లాభాల నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం వంటివి కూడా ప్రభావం చూపాయి.
ముఖ్యంగా ఐటీ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి సూచీలను పడేసింది. దాంతో సెన్సెక్స్ 750 పాయింట్లకు పైగా నష్టపోగా.. నిఫ్టీ 24,400 దిగువకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో సెన్సెక్స్ ఉదయం 79,019.34 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. రోజంతా నష్టాల బాటలోనే పయనించింది. ఇంట్రాడేలో 78,442.30 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 756.84 పాయింట్ల నష్టంతో 78,516.49 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 198.50 పాయింట్ల నష్టంతో 24,378.10 వద్ద ముగిసింది.
డాలరుతో రూపాయి మారకం విలువ 37 పైసలు క్షీణించి 93.81గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 10 శాతం మేర నష్టపోయింది. ఇన్ఫోసిస్, మహీంద్రా అండ్ మహీంద్రా, టీసీఎస్, టెక్ మహీంద్రా స్టాక్స్ కూడా నష్టాలు చవిచూశాయి. హిందుస్థాన్ యూనిలీవర్, ఎన్టీపీసీ, ఎటర్నల్, ట్రెంట్, అల్ట్రాటెక్ సిమెంట్ లాభపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 99 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం 4,754 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.