Stock market : భారతీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం భారీగా నష్టపోయింది. సెన్సెక్స్ 800 పాయింట్ల నష్టాన్ని చవిచూసింది. ఉదయం సెన్సెక్స్ స్వల్ప లాభాలతో 82,335.94 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. తర్వాత నెమ్మదిగా నష్టాల్లోకి చేరుకుంది. ఒక దశలో 800 పాయింట్ల వరకు నష్టపోయింది. చివరకు 769.67 పాయింట్లు (1 శాతం) నష్టపోయిన సెన్సెక్స్.. 81,537.70 వద్ద ముగిసింది.
నిఫ్టీ కూడా 241.25 పాయింట్లు నష్టపోయి 25,048.65 వద్ద ముగిసింది. మొత్తంగా స్టాక్ మార్కెట్ ఒక్క రోజులోనే దాదాపు రూ.6 లక్షల కోట్లు నష్టపోయింది. గ్లోబల్ పాలిటిక్స్, ఫారిన్ ఇన్వెస్టర్లు తమ పెట్టబడులు వెనక్కు తీసుకోవడం, అమెరికా-యూరప్ వద్ద టారిఫ్ వార్ వంటి కారణాలవల్ల స్టాక్ మార్కెట్లు బాగా నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలోనే రూ. 36,591 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. ప్రస్తుతం బీఎస్ఈ కంపెనీల మార్కెట్ విలువ రూ.452 కోట్లకు చేరుకుంది. డాలరుతో రూపాయి మారక విలువ 91.93తో అత్యంత కనిష్ట స్థాయికి చేరుకుంది. 0.02 శాతం రూపాయి నష్టపోయింది.
సెన్సెక్స్ 30 సూచీలో యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎటెర్నల్, అదానీ పోర్ట్స్, ఇండిగో వంటి సంస్థలు భారీగా నష్టపోయాయి. టెక్ మహీంద్రా, టీసీఎస్, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యునీలీవర్, ఏషియన్ పెయింట్స్ సంస్థల షేర్లు లాభపడ్డాయి. బంగారం ఔన్స్ ధర 4,926 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర 64.79 డాలర్ల వద్ద కొనసాగుతోంది.