Stock Markets | అంతర్జాతీయ మార్కెట్లలో నెగెటివ్ సెంటిమెంట్.. దేశీయ స్టాక్ మార్కెట్లపైనా పడింది. ఏడు సెషన్ల వరుస నష్టాలకు శుక్రవారం చెక్ పడినా.. సోమవారం మళ్లీ భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్ స్వల్ప నష్టాలతో మొదలై ముగింపుకల్లా భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్గత ట్రేడింగ్‌లో ఎక్కడా స్టాక్స్‌కు ఇన్వెస్టర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు కానరాలేదు. ఏండ్ల స్థాయి భారీ కనిష్టానికి గురైన ముడి చమురు ధర సుమారు నాలుగు శాతం పెరగడం కూడా ఇన్వెస్టర్లలో ఆందోళన పెంచింది. ఇప్పటికే అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అస్థిరతల ప్రభావంతో ఇన్వెస్టర్లు ఆచితూచి స్పందించారు.
ఉదయం 57,403.92 పాయింట్ల వద్ద నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించిన బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ ఇంట్రాడే ట్రేడింగ్‌లో 56,683.40 కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 638.11 పాయింట్ల నష్ట పోయి, 56,788.81 పాయింట్ల వద్ద స్థిర పడింది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ అంతర్గత ట్రేడింగ్‌లో 17,114.65- 16,855.55 పాయింట్ల మధ్య తచ్చాడింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 207 పాయింట్ల నష్టంతో 16,887.35 పాయింట్ల వద్ద సెటిలైంది.
భారత కుబేరుడు గౌతం అదానీ సారధ్యంలోని అదానీ గ్రూప్ షేర్లు 10 శాతం నష్టపోయాయి. గ్రూప్ ఫ్లాగ్షిప్ సంస్థ అదానీ ఎంటర్ప్రైజెస్ అమ్మకాల ఒత్తిడికి గురైంది. వరుసగా ఏడో సెషన్లో 20 శాతానికి పైగా పతనమైంది. అదానీ టోటల్ గ్యాస్ 10 శాతం, అదానీ గ్రీన్ 9, అదానీ విల్మార్ ఐదు శాతం, అదానీ పవర్ ఐదు శాతం, అదానీ ట్రాన్స్మిషన్ 6.5, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ 4.5 శాతం నష్టాలతో ముగిశాయి.
బీఎస్ఈ-30 ఇండెక్స్‌లో మూడు స్క్రిప్ట్‌లు లబ్ధి పోందాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఎన్టీపీసీ, భారతీ ఎయిర్టెల్ స్టాక్స్ మాత్రమే పాజిటివ్‌గా ముగిశాయి. మారుతి సుజుకి, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్), ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, ఐటీసీ, బజాజ్ ఫిన్సర్వ్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు నష్టపోయాయి.
ఎన్ఎస్ఈ-50 సూచీలో అదానీ ఎంటర్ ప్రైజెస్ అత్యధికంగా 9 శాతం నష్టపోయింది. తర్వాతీ జాబితాలో ఎచిర్ మోటార్స్, మారుతి సుజుకి, అదానీ పోర్ట్స్, హిందాల్కో, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్), కొటక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, బ్రిటానియా, ఎస్బీఐ, టాటా మోటార్స్ స్టాక్స్ రెండు నుంచి ఆరు శాతం వరకు నష్టపోయాయి. మరోవైపు ఓఎన్జీసీ, సిప్లా, కోల్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, బీపీసీఎల్, దివిస్ ల్యాబ్ష్, భారతీ ఎయిర్టెల్ లాభాలతో ముగిశాయి.