Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. టెలికాం, కన్స్యూమర్ డ్యూరబుల్స్ మినహా అన్ని రంగాల్లో అమ్మకాలు కనిపించాయి. ప్రపంచ మార్కెట్లో మిశ్రమ సంకేతాల మధ్య సూచీలు లాభాల్లో ప్రారంభమయ్యాయి. లాభాలను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 84,000.64 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో మొదలైంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 84,068.01 పాయింట్ల గరిష్టానికి చేరిన సెన్సెక్స్.. 83,412.77 పాయింట్ల కనిష్టానికి చేరుకుంది. చివరకు 519.34 పాయింట్లు పతనమై.. 83,459.15 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 165.70 పాయింట్లు పడిపోయి 25,597.65 వద్ద ముగిసింది.
బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.2శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.7శాతం పడిపోయాయి. గురునానక్ జయంతి సందర్భంగా బుధవారం స్టాక్ మార్కెట్లు మూతపడనున్ానయి. నిఫ్టీలో అత్యధికంగా నష్టపోయిన వాటిలో పవర్ గ్రిడ్ కార్ప్, కోల్ ఇండియా, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, బజాజ్ ఆటో, ఎటర్నల్ ఉన్నాయి. టైటాన్ కంపెనీ, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎంఅండ్ఎం లాభపడ్డాయి. కన్స్యూమర్ డ్యూరబుల్, టెలికాం మినహా మిగతా అన్ని రంగాల సూచీలు ఐటీ, ఆటో, ఎఫ్ఎంసీజీ, మెటల్, పవర్, రియాలిటీ, పీఎస్‌యూ సూచీలు 0.5శాతం నుంచి ఒకశాతం వరకు తగ్గాయి. క్యూ2 ఆదాయంతో భారతీ ఎయిర్టెల్ 52 వారాల గరిష్ట స్థాయికి చేరుకుంది. అలాగే, టైటాన్ కంపెనీ షేర్లు 2శాతం పెరిగాయి.
క్యూ2 ఫలితాలు బలహీనంగా ఉండడంతో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఇండియా షేర్ ధర దాదాపుగా 3శాతం తగ్గింది. గత నెలలో అమ్మకాలు పడిపోవడంతో హీరో మోటోకార్ప్ షేర్ ధర 4శాతం తగ్గింది. ఇజ్రాయెల్‌కు చెందిన టెక్నాలజీ సంస్థతో యూఎస్డీ 150 మిలియన్ల టెక్నాలజీ యాజమాన్య బదిలీ ఒప్పందంపై సంతకం చేయడంతో బ్లూ క్లౌడ్ షేర్లు 10శాతం పెరిగాయి. క్యూ2లో నష్టాలతో స్నోమాన్ లాజిస్టిక్స్ షేర్లు 5శాతం పడిపోయాయి. సిటీ యూనియన్ బ్యాంక్, ఎంఆర్‌పీఎల్, అసహి ఇండియా, ఢిల్లీవరీ, టైటాన్ కంపెనీ, భారతీ ఎయిర్టెల్, బీపీసీఎల్, ఓవోసీ, లారస్ ల్యాబ్స్, సీబీఐతో సహా 140 స్టాక్స్ బీఎస్ఈలో 52 వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.