Stock Markets | వరుసగా రెండోరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలను చవి చూశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 7.8 శాతం నుంచి ఏడు శాతానికి కుదిస్తూ ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ నిర్ధారించడంతో ఇన్వెస్టర్లపై ఒత్తిడి పెరిగింది. గురువారం ఉదయం తొలుత ట్రేడింగ్‌లో పాజిటివ్‌గా ఉన్నా, కొద్దిసేపటికే స్టాక్స్ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యం ఇవ్వడంతో మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ధరలను తగ్గించడానికి వడ్డీరేట్లు పెంచనున్నట్లు అమెరికా ఫెడ్ రిజర్వు ప్రకటించిన నేపథ్యంలో బుధవారం స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే.
గురువారం ఇంట్రా డేలో గరిష్ఠంగా 59,866 పాయింట్లకు దూసుకెళ్లిన సెన్సెక్స్ 810 పాయింట్ల వరకు నష్టపోయింది. ముగింపు దశలో కొంత కోలుకోవడంతో 413 పాయింట్ల నష్టంతో 59,934 పాయింట్ల వద్ద స్థిర పడింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 17,861 పాయింట్లకు పడిపోయినా.. ముగింపులో 126 పాయింట్ల పతనంతో 17,877 పాయింట్ల వద్ద నిలిచింది.
ఐటీ, ఫార్మా, సెలెక్టెడ్ మెటల్ స్టాక్స్ గురువారం ట్రేడింగ్‌లో ఒత్తిడికి గురయ్యాయి. హిందాల్కో, ఇన్ఫోసిస్, సిప్లా, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, దివిస్ ల్యాబ్స్, అపోలో హాస్పిటల్స్ తదితర స్టాక్స్.. నిఫ్టీలో ప్రధానంగా నష్టపోయిన స్క్రిప్టులు. అదనంగా హీరో మోటో కార్ప్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఆటో, టైటాన్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ నష్టపోయాయి.
ఇదిలా ఉంటే, బ్యాంకింగ్, ఆటో స్టాక్స్ దూసుకెళ్లాయి. మారుతి సుజుకి, ఎచిర్ మోటార్స్, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా 2.6 శాతం వరకు లబ్ధి పొందాయి. అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, గ్రాసింగ్, కోల్ ఇండియా తదితర స్క్రిప్టులు లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.3 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.06 శాతం లాభాలు గడించాయి. సెన్సెక్స్-30లో ఏడు షేర్లు మాత్రమే లాభపడ్డాయి.
గురువారం ఉదయం 69,454.37 పాయింట్ల వద్ద బీఎస్ఈ సెన్సెక్స్ ట్రేడింగ్ పాజిటివ్‌గా మొదలైంది. అంతర్గత ట్రేడింగ్‌లో ఒకానొక దశలో 60,676.12 పాయింట్ల గరిష్ఠాన్ని తాకి 59,865.75 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 412.96 పాయింట్ల పతనంతో 59,934.01 పాయింట్ల వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈ నిఫ్టీలో సైతం 18,046.35 పాయింట్ల వద్ద పాజిటివ్‌గా మొదలైన ట్రేడింగ్‌లో 18,096.15 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. 17,861.50 పాయింట్ల కనిష్ఠానికి పడిపోయి చివరకు 126.35 పాయింట్ల పతనంతో 17,877.40 వద్ద స్థిరపడింది. ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.79.66 వద్ద స్థిర పడింది.
కేంద్ర ముడి చమురు సంస్థ భారతీయ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)లో ప్రస్తుతానికి ప్రభుత్వ వాటాల ఉపసంహరణ లేదని కేంద్ర చమురుశాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరీ ప్రకటించారు. ఫలితంగా బీపీసీఎల్ షేర్లు 1.58 శాతం నష్టంతో రూ.330.70 వద్ద నిలిచాయి.