ముంబై, సెప్టెంబర్ 19 : దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్‌పడింది. అదానీ గ్రూపునకు చెందిన షేర్లు భారీగా పుంజుకున్నప్పటికీ బ్లూచిప్ సంస్థల షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ జరగడంతో సూచీలు భారీగా నష్టపోయాయి. ఇంట్రాడేలో 500 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 83 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. మార్కెట్ ముగిసే సమయానికి సూచీ 387.73 పాయింట్లు నష్టపోయి 82,626.23 వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ 96.55 పాయింట్లు కోల్పోయి 25,327.05 వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఐటీ రంగ షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ జరగడంతో మొత్తం సూచీలపై ప్రతికూల ప్రభావం చూపిందని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి.
హెచ్‌సీఎల్ టెక్నాలజీ 1.76 శాతం నష్టపోయి టాప్ లూజర్‌గా నిలిచింది. దీంతోపాటు ఐసీఐసీఐ బ్యాంక్, మహీంద్రా, టైటాన్, ట్రెంట్, కొటక్ బ్యాంక్, హెచ్‌యూఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, రిలయన్స్, ఐటీసీ, టాటా మోటర్స్, ఎల్అండ్టీ, టీసీఎస్ షేర్లు నష్టపోయాయి. కానీ, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్, యాక్సిస్ బ్యాంక్, మారుతి, సన్‌ఫార్మా, ఎన్టీపీసీ, ఎస్బీఐ, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాల్లో ముగిశాయి. రంగాలవారీగా కన్జ్యూమర్ డ్యూరబుల్, ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు ఒక్క శాతం వరకు నష్టపోయాయి.
అదానీ గ్రూపు షేర్లు భారీగా లాభపడ్డాయి. హిండెన్‌బర్గ్ లేవనెత్తిన పలు అనుమానాలపై సెబీ క్లీన్చిట్ ఇవ్వడంతో గ్రూపు షేర్లు రివ్వున ఎగిశాయి. అదానీ పవర్ షేరు అత్యధికంగా 12.40 శాతం లాభపడగా..అదానీ టోటల్ గ్యాస్ 7.35 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ 5.33 శాతం, అదానీ ఎంటర్ప్రైజెస్ 5.04 శాతం, ఎన్డీటీవీ 4.98 శాతం, అదానీ ఎనర్జీ సొల్యుషన్స్ 4.70 శాతం, సంఘీ ఇండస్ట్రీస్ 1.41 శాతం, ఏసీసీ 1.21 శాతం, అదానీ పోర్ట్స్ 1.09 శాతం, అంబుజా సిమెంట్ షేర్లు లాభాల్లో ముగిశాయి. దీంతో అదానీ గ్రూపు మార్కెట్ విలువ రూ.69 వేల కోట్ల మేర పెరిగింది.