ముంబై, ఫిబ్రవరి 5: స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్‌పడింది. వాణిజ్య యుద్ధానికి తోడు ఈవారం చివర్లో రిజర్వుబ్యాంక్ తన తదుపరి సమీక్షలో వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలుండటం మదుపరులను అమ్మకాలవైపు నడిపించింది. ఇంట్రాడేలో 400 పాయింట్ల వరకు నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 312.53 పాయింట్లు కోల్పోయి 78,271.28 వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ కూడా 42.95 పాయింట్లు కోల్పోయి 23,696.30 వద్ద నిలిచింది. 23,807 నుంచి 23,680 పాయింట్ల శ్రేణిలో కదలాడిన నిఫ్టీ చివరకు నష్టపోయింది. దేశీయ కరెన్సీ విలువ చారిత్రక కనిష్ఠ స్థాయికి జారుకోవడం మార్కెట్లో సెంటిమెంట్‌ను నిరాశపరిచింది.
30 షేర్ల ఇండెక్స్‌లో ఏషియన్ పెయింట్స్ అత్యధికంగా 3 శాతం నష్టపోయి టాప్ లూజర్‌గా నిలిచింది. దీంతోపాటు టైటాన్, నెస్లె, హెచ్‌యూఎల్, ఎస్బీఐ, లార్సెన్ అండ్ టుబ్రో, ఐటీసీ, జొమాటో,హెచ్‌సీఎల్ టెక్, కొటక్ బ్యాంక్, రిలయన్స్, టీసీఎస్, మహీంద్రా, పవర్‌గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, మారుతి, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. కానీ, అదానీ పోర్ట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా మోటర్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా షేర్లకు మదుపరుల నుంచి మద్దతు లభించింది. రంగాలవారీగా చూస్తే వడ్డీరేట్లకు సంబంధం ఉన్న రంగాల్లో షేర్లు కుదేలయ్యాయి.
ముఖ్యంగా రియల్టీ రంగ సూచీ అత్యధికంగా 1.66 శాతం కోల్పోగా, ఎఫ్ఎంసీజీ 1.42 శాతం, కన్జ్యూమర్ డ్యూరబుల్ 1.21 శాతం, వాహన రంగ షేర్లు కూడా నష్టపోయాయి. అలాగే ఆయిల్ అండ్ గ్యాస్ 1.89 శాతం, సేవలు 1.59 శాతం, మెటల్ 1.55 శాతం, ఎనర్జీ 1.30 శాతం, హెల్త్‌కేర్ రంగ సూచీ 1.21 శాతం చొప్పున పెరిగాయి. ఈ నెల 7న ఆర్బీఐ తన తదుపరి పరపతి సమీక్షను ప్రకటించబోతున్నది.