ముంబై, మే 10: వరుస పతనాలతో సతమతమవుతున్న స్టాక్ సూచీలు మంగళవారం ఒక్కసారిగా పెరిగినప్పటికీ, ముగింపులో తిరిగి నష్టాలనే మూటకట్టుకున్నాయి. ఇంట్రాడేలో బీఎస్ఈ సెన్సెక్స్ 300 పాయింట్లకుపైగా లాభపడి 54,850 పాయింట్ల వద్దకు చేరి, అటుతర్వాత తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యింది. చివరకు 106 పాయింట్ల నష్టంతో 54,365 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం ఇదేబాటలో ఒకదశలో 16,400 పాయింట్ల స్థాయిని అందుకున్న తర్వాత నష్టాల్లోకి జారిపోయింది. తుదకు 62 పాయింట్లు కోల్పోయి 16,240 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మార్కెట్ తగ్గడం వరుసగా ఇది మూడో రోజు.
టాటా స్టీల్ టాప్ లూజర్
సెన్సెక్స్-30 షేర్లలో అన్నింటికంటే అధికంగా టాటా స్టీల్ 6.95 శాతం తగ్గింది. సన్‌ఫార్మా, ఎన్టీపీసీ, టైటాన్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా, ఐటీసీలు 1-5 శాతం మధ్య తగ్గాయి. మరోవైపు హిందుస్థాన్ యునీలీవర్, ఏషియన్ పెయింట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతి, కొటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ ద్వయం 3.24 శాతం వరకూ లాభపడ్డాయి. రంగాలవారీగా చూస్తే మెటల్ ఇండెక్స్ భారీగా 5.62 శాతం క్షీణించింది.
3 రోజుల్లో 11 లక్షల కోట్ల సంపద ఆవిరి
వరుసగా మూడు ట్రేడింగ్ సెషన్లలో జరిగిన అమ్మకాలతో రూ. 11.22 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. దీంతో బీఎస్ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ. 2,48,42,500 కోట్లకు తగ్గింది.
ఎఫ్‌పీఐల భారీ అమ్మకాలు
మరో రెండ్రోజుల్లో ఏప్రిల్ నెలకు ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో విదేశీ ఫోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) భారీ విక్రయాలు జరిపారు. వీరు మంగళవారం రూ. 3,960 కోట్ల విలువైన షేర్లను నికరంగా విక్రయించినట్టు స్టాక్ ఎక్ఛేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సోమవారం సైతం ఎఫ్‌పీఐలు ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ. 3,362 కోట్లు వెనక్కు తీసుకున్నారు.