ముంబై, నవంబర్ 11: ఒకవైపు అంతర్జాతీయ ద్రవ్యోల్బణం ఒత్తిడులు, మరోవైపు విదేశీ ఫండ్స్ అమ్మకాలతో భారత స్టాక్ సూచీలు వరుసగా మూడో రోజూ తగ్గాయి. గురువారం బీఎస్ఈ సెన్సెక్స్ 433 పాయింట్ల క్షీణతతో 59,920 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 144 పాయింట్లు నష్టపోయి, 17,874 వద్ద క్లోజయ్యింది. బీఎస్ఈ-30 షేర్లలో 22 షేర్లు నష్టాలకు లోనుకాగా, ఎన్ఎస్ఈ-50లో 41 షేర్లు తగ్గాయి. అక్టోబర్ నెలలో అమెరికా ద్రవ్యోల్బణం 6.2 శాతం పెరిగినట్లు వెలువడిన వార్తలు ఇన్వెస్టర్లను ఆందోళనకు లోనుచేసాయని, దీంతో స్టాక్ సూచీలు బాగా తగ్గినట్లు జియోజిత్ ఫైనాన్షియల్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. గత మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతస్థాయిలో అమెరికా ద్రవ్యోల్బణం పెరగడంతో ఆ దేశపు కేంద్ర బ్యాంక్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచుతుందన్న అంచనాలు మొదలయ్యాయి. దీంతో క్రితం రోజు అమెరికా స్టాక్ సూచీలు తీవ్రంగా తగ్గిన ప్రభావం ఇతర దేశాలపై పడింది.
బ్యాంకింగ్ షేర్ల పతనం&ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలకు ప్రతికూలంగా స్పందించే బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లు తాజాగా క్షీణించాయి. సెన్సెక్స్-30 షేర్లలో అన్నింటికంటే అధికంగా ఎస్బీఐ 2.83 శాతం తగ్గగా, ఐసీఐసీఐ బ్యాంక్, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీలు 1.3 శాతం వరకూ క్షీణించాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కొటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లతో పాటు ఫైనాన్షియల్ షేర్లు బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్‌లు నష్టాల పాలయ్యాయి. ఇతర రంగాలకు చెందిన షేర్లలో టెక్ మహింద్రా, సన్‌ఫార్మా, ఏషియన్ పెయింట్స్, పవర్‌గ్రిడ్, హెచ్‌యూఎల్‌లు తగ్గాయి. మరోవైపు టైటాన్, ఎం అండ్ ఎం, రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్‌లు స్వల్పంగా లాభపడ్డాయి. రంగాలవారీగా చూస్తే బీఎస్ఈ రియల్టీ, హెల్త్‌కేర్, బ్యాంకెక్స్, ఫైనాన్స్, టెలికం, ఆటో ఇండెక్స్‌లు 2.5 శాతం వరకూ క్షీణించాయి.
విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు…
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) ఈ గురువారం ఒక్కరోజునే భారీగా రూ. 1,637 కోట్ల విలువైన షేర్లను నికరంగా విక్రయించినట్లు స్టాక్ ఎక్సేంజీల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. విదేశీ ఫండ్స్ బుధవారం రూ.469 కోట్ల అమ్మకాలు జరపగా, ఈ నెలలో నవంబర్ 10 వరకూ ఈ ఫండ్స్ స్టాక్ మార్కెట్ నుంచి రూ. రూ.5,115 కోట్లు వెనక్కు తీసుకున్నాయి.
తగ్గిన రూపాయి విలువ
అమెరికా డాలరు మారకంలో రూపాయి విలువ వరుసగా రెండో రోజూ తగ్గింది. క్రితం రోజు 30 పైసల మేర నష్టపోయిన భారత కరెన్సీ గురువారం మరో 18 పైసలు కోల్పోయింది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్)లో రూపాయి 74.52 వద్ద ముగిసింది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను పెంచవచ్చన్న అంచనాలతో డాలరు ఇండెక్స్ 16 నెలల గరిష్ఠానికి పెరిగినందున, వర్థమాన దేశాల కరెన్సీలు క్షీణించాయని, ఈ క్రమంలోనే రూపాయి విలువ కూడా తగ్గినట్లు ఫారెక్స్ డీలర్లు చెప్పారు.