ముంబై, జూన్ 10: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఈ ఒక్కరోజే లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోవడంతో ఇన్వెస్టర్లకు బ్లాక్ ఫ్రైడేగా మిగిలింది. మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో ఉదయం ఆరంభం నుంచీ సూచీలు నష్టాల్లోనే కదలాడాయి. దేశ, విదేశీ ప్రతికూల పరిస్థితులు ఇన్వెస్టర్లను రక్షణాత్మక ధోరణిలోకి నెట్టాయి. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,016.84 పాయింట్లు లేదా 1.84 శాతం కోల్పోయి 54,303.44 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ 276.3 పాయింట్లు లేదా 1.68 శాతం దిగజారి 16,201.8 వద్ద నిలిచింది. ఫలితంగా ఈ వారం మొత్తంగా సెన్సెక్స్ 1,465.79 పాయింట్లు లేదా 2.63 శాతం, నిఫ్టీ 382.5 పాయింట్లు లేదా 2.31 శాతం క్షీణించినైట్టెంది.
గ్లోబల్ మార్కెట్లలో..
మెజారిటీ ఆసియా, ఐరోపా మార్కెట్లూ నష్టాలతోనే సరిపెట్టుకున్నాయి. ఆసియా దేశాల్లో చైనా మినహా జపాన్, హాంకాంగ్, దక్షిణ కొరియా వంటి ప్రధాన సూచీలు నష్టపోయాయి. ఐరోపా దేశాల్లో కీలక మార్కైట్లెన బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సూచీలూ నష్టాల్లోనే కదలాడుతున్నాయి. ఐరోపా సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్లను పెంచుతామని చెప్పడం, అమెరికాలో ద్రవ్యోల్బణం విజృంభించడం, ఫెడరల్ రిజర్వ్ సైతం మళ్లీ వడ్డింపులకు దిగనుందన్న అంచనాలు మదుపరులను లాభాల స్వీకరణ దిశగా నడిపిస్తున్నాయి.
3 లక్షల కోట్ల సంపద ఆవిరి
భారీ నష్టాల నడుమ బీఎస్ఈలో నమోదైన సంస్థల మార్కెట్ విలువ ఈ ఒక్కరోజే రూ.3.11 లక్షల కోట్లు హరించుకుపోయింది. రూ.2,51,84,358.86 కోట్లకు పరిమితమైంది. వరుసగా నాలుగు రోజులపాటు పడిపోయిన స్టాక్ మార్కెట్లు.. గురువారం లాభాల్లో ముగిసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆనందం శుక్రవారం ఆవిరైపోయింది. సెన్సెక్స్ షేర్లలో కొటక్ మహీంద్రా బ్యాంక్ అత్యధికంగా 3.96 శాతం నష్టపోయింది. బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, విప్రో, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టాటా స్టీల్ షేర్లూ మదుపరులను ఆకట్టుకోలేకపోయాయి. ఐటీ, టెక్నాలజీ, బ్యాంకింగ్, ఫైనాన్స్, చమురు, గ్యాస్ రంగాల సూచీలు 2.09 శాతం దిగజారాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలూ 1.72 శాతం పడిపోయాయి.
అయ్యయ్యో.. రూపాయి
డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ మునుపెన్నడూ లేనివిధంగా పడిపోతున్నది. శుక్రవారం ట్రేడింగ్‌లో మరో 19 పైసలు క్షీణించి ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయి 77.93 వద్దకు దిగజారింది. తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు, గ్లోబల్ మార్కెట్లో పెరుగుతున్న ముడి చమురు ధరలు.. భారతీయ కరెన్సీపై ఒత్తిడిని తీసుకొస్తున్నాయని ఫారెక్స్ మార్కెట్ నిపుణులు ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. ఉదయం 77.81 వద్ద మొదలైన రూపాయి ట్రేడింగ్.. క్రమేణా నష్టపోయింది. గురువారం 77.74 వద్ద నిలిచిన విషయం తెలిసిందే. పరిస్థితుల్ని చూస్తే వచ్చే వారం 78 స్థాయికి దిగజారినా ఆశ్చర్యపోనక్కర్లేదనిపిస్తున్నది.
నష్టాలకు కారణాలివి..