ముంబై, డిసెంబర్ 3: దేశీయ స్టాక్ మార్కెట్లపై మరోసారి కరోనా వైరస్ పంజావిసిరింది. వరుసగా రెండు రోజులుగా భారీగా లాభపడ్డ స్టాక్ మార్కెట్లపై ఒమిక్రాన్ పిడుగు పడింది. ఈ నూతన వైరస్ దేశవ్యాప్తంగా విజృంభించనున్నట్లు మదుపరుల్లో భయాలు నెలకొన్నాయి. దీంతో పెట్టుబడిదారులు అమ్మకాలకు మొగ్గుచూపారు. లాభాల్లో ప్రారంభమైన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 58 వేల దిగువకు పడిపోయింది. వారాంతం ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 764.83 పాయింట్లు(1.31 శాతం) తగ్గి 57,696.46 స్థాయికి జారుకోగా, జాతీయ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ 204.95 పాయింట్లు పతనం చెంది 17,196.70 పాయింట్ల వద్ద ముగిసింది.
పవర్‌గ్రిడ్ నాలుగు శాతానికి పైగా క్షీణించి టాప్ లూజర్‌గా నిలిచింది. దీంతోపాటు రిలయన్స్, కొటక్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్‌లు రెండు శాతం వరకు మార్కెట్ వాటాను కోల్పోయాయి.
సన్‌ఫార్మా, మారుతి, ఐటీసీ, మహీంద్రా, రెడ్డీస్, హెచ్డీఎఫ్సీ, ఎన్టీపీసీ, బజాజ్ ఆటో, హెచ్‌సీఎల్ టెక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, ఇన్ఫోసిస్, టైటాన్, టీసీఎస్‌లు మదుపరులను ఆకట్టుకోలేకపోయాయి.
కేవలం ఎల్అండ్టీ, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్లు మాత్రమే పెరిగాయి.
రంగాలవారీగా చూస్తే ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్, ఫైనాన్స్, హెల్త్‌కేర్‌లు రెండు శాతానికి పైగా పతనం చెందగా..క్యాపిటల్ గూడ్స్, ఇండస్ట్రియల్స్ రంగ షేర్లు లాభపడ్డాయి.
ఈవారంలో సెన్సెక్స్ 589.31 పాయింట్లు(1.03 శాతం), నిఫ్టీ 170.25 పాయింట్లు పతనం చెందింది.
అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ 2.38 శాతం పెరిగి 71.32 డాలర్లు పలికింది.
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 14 పైసలు తగ్గి 75.16 వద్ద నిలిచింది.