Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. అమెరికాలో ఆర్థిక మాంద్యం భయాల మధ్య పెట్టుబడిదారులు భయాందోళనకు గురయ్యారు. అమెరికా మార్కెట్ల పతనం సైతం దేశీయ మార్కెట్లపై భారీ ప్రభావం పడింది. ఈ క్రమంలో మార్కెట్లు ప్లాట్‌గా ముగిశాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్.. 73,743.88 పాయింట్ల వద్ద నష్టాల్లో మొదలైంది. ఆ తర్వాత మార్కెట్లు కోలుకున్నాయి. ఈ క్రమంలో ఇంట్రాడేలో 74,195.17 పాయింట్లు గరిష్ఠానికి సెన్సెక్స్ పెరిగింది. చివరలో స్వల్పంగా లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. ఇంట్రాడేలో 73,663.60 కనిష్ఠానికి చేరింది.
చివరకు 12.85 పాయింట్లు తగ్గి.. 74,102.32 వద్ద ముగిసింది. నిఫ్టీ 37.60 పాయింట్ల లాభంతో 22,497.90 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో దాదాపు 1,411 షేర్లు పెరగ్గా.. 2,406 షేర్లు పతనమయ్యాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.7 శాతం పెరిగాయి. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.7 శాతం తగ్గాయి. నిఫ్టీలో ట్రెంట్, సన్ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, బీపీసీఎల్ అత్యధికంగా లాభపడ్డాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్సర్వ్, పవర్ గ్రిడ్ కార్ప్, ఎంఅండ్ఎం నష్టపోయాయి. రంగాల్లో మెటల్, రియాల్టీ, టెలికాం, ఆయిల్, గ్యాస్ 0.5 నుంచి 3శాతం వరకు పెరిగాయి. ఆటో, ఐటీ, బ్యాంక్ 0.3 నుంచి 0.7 శాతం వరకు పడిపోయాయి.