Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. అమెరికా మార్కెట్లు పుంజుకోవడంతో భారతీయ మార్కెట్లపై సానుకూల ప్రభావం పడింది. ఈ క్రమంలో ఉదయం మార్కెట్లు లాభాల్లో మొదలయ్యాయి. అయితే, ప్రారంభంలో లాభాల్లో ట్రేడవడంతో సెన్సెక్స్, నిఫ్టీల్లో అమ్మకాలు కనిపించాయి. సెన్సెక్స్ ఉదయం 81,768.72 వద్ద లాభాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 81,445.30 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసిన సెన్సెక్స్ అత్యధికంగా 82,196.55 పాయింట్ల గరిష్ఠానికి చేరుకున్నది. చివరకు 361.75 పాయింట్ల లాభంతో 81,921.29 వద్ద ముగిసింది. నిఫ్టీ 104.70 పాయింట్లు పెరిగి.. 25,041.10 వద్ద స్థిరపడింది.
ట్రేడింగ్‌లో దాదాపు 2473 షేర్లు పురోగమించగా, 1300 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో దివిస్ ల్యాబ్స్, ఎల్‌టీఐఎండ్‌ట్రీ, భారతీ ఎయిర్టెల్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్ లాభాలను ఆర్జించాయి. హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ నష్టపోయాయి. ఆయిల్ అండ్ గ్యాస్ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు లాభాలను నమోదు చేశాయి. టెలికాం, మీడియా 2శాతం చొప్పున పెరగ్గా.. క్యాపిటల్ గూడ్స్, ఐటీ, హెల్త్‌కేర్ షేర్లు ఒకశాతం చొప్పున పెరిగాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.5 శాతం లాభపడ్డాయి.