Stock Markets Close | భారత స్టాక్ మార్కెట్లు చరిత్రలో తొలిసారిగా కొత్త శిఖరాలను తాకాయి. ఇటీవల వరుసగా కొత్త రికార్డులను నెలకొల్పుతూ దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు మంగళవారం మరోసారి గత రికార్డులను తిరగరాస్తూ ఆల్‌టైమ్ హైకి చేరాయి. చివరకు మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లు ఒక్కసారిగా ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించగా.. వరుస సెషన్లో మార్కెట్లు వరుస లాభాల్లో కొనసాగుతూ వస్తున్నాయి. ఇదే క్రమంలో ఇవాళ ఉదయం సెన్సెక్స్ 84,860.73 పాయింట్ల వద్ద ఫ్లాట్‌గా మొదలైంది. అయితే, మధ్యాహ్నం వరకు సూచీలు మరింత దిగజారాయి. ఆ తర్వాత కోలుకొని లాభాల్లోకి దూసుకెళ్లాయి.
చివరి సెషన్లో అమ్మకాలతో ఫ్లాట్‌గా ముగిశాయి. ఇంట్రాడేలో 84,716.07 పాయింట్ల కనిష్ఠానికి పతనమైన సెన్సెక్స్.. 85,163.23 పాయింట్ల గరిష్ఠానికి పెరిగింది. చివరకు 14.57 పాయింట్లు పతనమై.. 84,914.04 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 1.35 పాయింట్లు పెరిగి.. 25,940.40 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో నిఫ్టీ 26,011.55 పాయింట్ల గరిష్ఠానికి చేరింది. ట్రేడింగ్‌లో దాదాపు 1871 షేర్లు పెరగ్గా.. మరో 1946 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో టాటా స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్, పవర్ గ్రిడ్ కార్ప్, టెక్ మహీంద్రా, అదానీ ఎంటర్ప్రైజెస్ లాభపడ్డాయి. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్‌యూఎల్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్, శ్రీరామ్ ఫైనాన్స్ నష్టపోయాయి. సెక్టోరల్‌లో మెటల్ ఇండెక్స్ 3శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 0.6 శాతం, పవర్ ఇండెక్స్ 1.4 శాతం పెరిగాయి. మరోవైపు పీఎస్‌యూ బ్యాంక్, ఎఫ్ఎంసీజీ, టెలికాం 0.5-1 శాతం దిగజారాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి.