Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు క్రాష్ అయ్యాయి. సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకుపైగా పతనం కాగా.. నిఫ్టీ 330 పాయింట్లకుపైగా దిగజారింది. రూపాయి పతనం, అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లపై నిర్ణయం ప్రకటించనున్న నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. ఈ క్రమంలో స్టాక్ అమ్మకాల నేపథ్యంలో ఒక్కసారిగా కుదేలయ్యాయి. మంగళవారం సెన్సెక్స్ క్రితం సెషన్‌తో పోలిస్తే 81,511.81 పాయింట్ల వద్ద నష్టాల్లో మొదలైంది. ఇక మళ్లీ ఏ దశలోనూ కోలుకోలేదు. ఇంట్రాడేలో 81,613.64 పాయింట్ల గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్.. అత్యల్పంగా 80,612.20 పడిపోయింది.
చివరకు 1,064.12 పాయింట్లు పతనమై.. 80,684.45 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 332.25 పాయింట్ల నష్టపోయి.. 24,336.00 వద్ద స్థిరపడింది. మార్కెట్లో దాదాపు 1,497 షేర్లు పురోగమించగా.. 2,360 షేర్లు పతనమయ్యాయి. మరో 85 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో శ్రీరామ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, హీరో మోటోకార్ప్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ టాప్ లూజర్‌గా నిలిచాయి. కేవలం సిప్లా మాత్రమే లాభపడింది. ఆటో, బ్యాంక్, ఎనర్జీ, మెటల్, ఆయిల్, గ్యాస్ షేర్లు శాతం చొప్పున పతనం కాగా.. అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 0.5 శాతం పడిపోయాయి.