Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు గురువారం నష్టాల్లో ముగిశాయి. వరుసగా ఏడు రోజుల పాటు ర్యాలీని కొనసాగించిన సూచీలు పడిపోయాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య విధాన సమీక్ష, ఎఫ్ఎంసీజీ, ఐటీ, మెటల్ కంపెనీల షేర్లలో అమ్మకాల కారణంగా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 132.04 పాయింట్లు పతనమై 69,521.69 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 36.50 పాయింట్లు తగ్గి 20,901.20 వద్ద ముగిసింది. దాదాపు 1,893 షేర్లు పురోగమించగా.. 1342 షేర్లు క్షీణించాయి. 81 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో భారతీ ఎయిర్టెల్, హెచ్‌యూఎల్, ఓఎన్జీసీ, అపోలో హాస్పిటల్స్, టాటా స్టీల్ టాప్ లూజర్‌గా నిలిచాయి.
పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అదానీ పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, సిప్లా, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లాభాలను నమోదు చేశారు. సెక్టోరల్ ఫ్రంట్‌లో ఆటో, హెల్త్‌కేర్ ఒక్కొక్కటి 0.5 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ ఒకశాతం చొప్పున పెరిగాయి. పవర్ ఇండెక్స్ దాదాపు 3 శాతం పెరిగాయి. ఎఫ్ఎంసీజీ, మెటల్ సూచీలు 0.5 శాతం తగ్గాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.7 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం పెరిగాయి. మరో వైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీ రేటును నిర్ణయించే మానిటరీ కమిటీ (MPC) సమాశం అవుతున్నది. ఐదోసారి రెపో రేటును 6.5శాతం వద్ద యథాతథంగా ఉంచే అవకాశం ఉంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు కమిటీ సమావేశం ముగిసిన తర్వాత కీలక వడ్డీ రేట్లు, జీడీపీ, ద్రవ్యోల్బణం అంచనాలకు సంబంధించి ఎంపీసీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించనున్నారు.