Sensex Closing Bell | రెండురోజుల వరుస నష్టాల అనంతరం గురువారం సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు ఉన్నా స్టాక్ మార్కెట్లు లాభాల్లో పయనించాయి. కంపెనీలకు సంబంధించిన అక్టోబర్-డిసెంబర్ త్రైమాసిక ఫలితాలపై సానుకూల అంచనాలున్నాయి. ఈ క్రమంలో మదుపరుల నుంచి మద్దతు లభించింది. దీంతో సూచీలు లాభాల్లో పయనించాయి. ఇవాళ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 490 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 141 పాయింట్లకుపైగా పెరిగింది.
ఉదయం సెన్సెక్స్ 71,678.93 పాయింట్ల వద్ద టేడ్రింగ్ మొదలైంది. ఇంట్రాడేలో 71,954 పాయింట్ల గరిష్ఠానికి చేరుకుంది. చివరకు 490.07 పాయింట్ల లాభంతో 71,847.57 వద్ద స్థిరపడింది. మరో వైపు నిఫ్టీ 141.26 పెరిగి.. 21,658.60 పాయింట్ల వద్ద ముగిసింది. దేశీయ స్టాక్ మార్కెట్లో గురువారం ట్రేడింగ్ సెషన్లో బ్యాంకింగ్, ఫైనాన్షియల్, రియల్టీ రంగాల షేర్లలో గరిష్ట కొనుగోళ్లు కనిపించాయి. 50 షేర్ల బెంచ్‌మార్క్ ఇండెక్స్ నిఫ్టీలో బజాజ్ ఫైనాన్స్ షేర్లు 4శాతానికిపైగా ఎక్కువ లాభంతో టాప్ గెయినర్స్‌గా నిలిచాయి.
ట్రేడింగ్‌లో దాదాపు 2,267 షేర్లు పురోగమించగా.. 1,034 షేర్లు పతనమయ్యాయి. 79 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, ఓఎన్టీసీ, టాటా కన్స్యూమర్, ఇండస్ఇండ్ బ్యాంక్ లాభాల్లో ముగిశాయి. బీపీసీఎల్, ఎల్‌టీఐఎండ్‌ట్రీ, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హీరో మోటోకార్ప్ నష్టాల్లో ముగిశాయి. రియల్టీ ఇండెక్స్ 6.6 శాతం, పవర్ ఇండెక్స్ 2 శాతం, బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ 0.5 నుంచి ఒకశాతం వరకు పెరిగాయి. బీఎస్ఈలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఒకశాతం చొప్పున పెరిగాయి.