Stock Market | భారతీ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాల నేపథ్యంలో మార్కెట్లు ఉదయం లాభాల్లో మొదలయ్యాయి. మధ్యాహ్నం వరకు పెరుగుతూ వచ్చిన సూచీలు ఒక్కసారిగా పతమయ్యాయి. చివరి సెషన్లో మళ్లీ కోలుకొని స్వల్ప నష్టాల్లో ముగిశాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 80,415.47 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 80,482.36 పాయింట్ల గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్.. ఒక దశలో 79,798.67 పాయింట్ల కనిష్ఠానికి చేరుకుంది. చివరకు 105.79 పాయింట్లు పతనమై.. 80,004.06 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 27.40 పాయింట్ల నష్టంతో 24,194.50 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో దాదాపు 2,179 షేర్లు పురోగమించాయి.
మరో 1,580 షేర్లు పతనం కాగా.. 105 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో బ్రిటానియా ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫోసిస్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, సన్ ఫార్మా, బజాజ్ ఆటో నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగియగా.. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం పెరిగింది. రంగాలవారీగా ఆటో, పవర్, ఫార్మా, ఆయిల్, గ్యాస్ ఒకశాతం నుంచి 1.15శాతం వరకు దిగజారాయి. ఎఫ్ఎంసీజీ, ఐటీ, మెటల్ 0.5శాతం నుంచి ఒకశాతం వరకు వృద్ధిని నమోదు చేశాయి. మంగళవారం డాలర్‌తో పోలిస్తే రూపాయి.. 5 పైసలు తగ్గి రూ.84.33 వద్ద స్థిరపడింది.