Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు లాభాల్లో ముగిశాయి. ప్రపంచ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల మధ్య మార్కెట్లు ఉదయం సానుకూలంగా మొదలయ్యాయి. బ్లూ-చిప్, ఐటీ స్టాక్స్‌లో అమ్మకాలు మార్కెట్‌పై ఒత్తిడిని కలిగించాయి. ఫైనాన్షియల్ షేర్లలో కొనుగోళ్లు మార్కెట్‌కు దన్నుగా నిలిచాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 75,473.17 పాయింట్ల లాభాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 75,201.48 పాయింట్ల కనిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్.. 75,568.38 పాయింట్ల గరిష్ఠానికి చేరుకుంది. చివరకు 147.79 పాయింట్లు పెరిగి.. 75,449.05 వద్ద ముగిసింది. నిఫ్టీ 73.30 పాయింట్లు పెరిగి 22,907.60 వద్ద స్థిరపడింది.
ట్రేడింగ్‌లో దాదాపు 2,894 షేర్లు లాభాలను నమోదు చేశాయి. 988 షేర్లు క్షీణించగా.. మరో 110 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో అత్యధికంగా శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, అపోలో హాస్పిటల్స్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్ కార్ప్ లాభపడ్డాయి. టెక్ మహీంద్రా, టీసీఎస్, ఐటీసీ, ఇన్ఫోసిస్, బ్రిటానియా ఇండస్ట్రీస్ నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 2 శాతానికిపైగా పెరిగాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ మినహా, మిగతా అన్ని రంగాల సూచీలు కన్స్యూమర్ డ్యూరబుల్స్, క్యాపిటల్ గూడ్స్, రియాల్టీ, ఆయిల్, గ్యాస్, మీడియా, మెటల్, పవర్, సీఎస్‌యూ బ్యాంక్ ఒకటి నుంచి 2.8 శాతం దాకా పెరిగాయి.