Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఇంట్రాడేలో సూచీలు జీవనకాల గరిష్ఠానికి చేరాయి. సెన్సెక్స్ తొలిసారిగా 77,851 పాయింట్లు.. నిఫ్టీ సైతం 23,664 పాయింట్లకు చేరాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాలతో ఇవాళ ఉదయం సూచీలు లాభాల్లో మొదలవగా.. చివరి వరకు అదే జోరు కొనసాగలేకపోయింది. సూచీలు ఆల్‌టైమ్ హైకి చేరడంతో మదుపరులు లాభాల స్వీకరణకు దిగారు. దాంతో మార్కెట్లు ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. దాంతో ప్రారంభంలో వచ్చిన లాభాలు కాస్త ఆవిరయ్యాయి. దాంతో సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం సెన్సెక్స్ 77,543.22 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఆ తర్వాత అదే ఉత్సాహంతో ఇంట్రాడేలో 77,851.63 పాయింట్ల గరిష్ఠానికి చేరింది. మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో 76,954.87 పాయింట్ల కనిష్ఠానికి పతనమైంది.
చివరకు 36.45 పాయింట్ల స్వల్ప లాభంతో 77,337.59 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ తొలిసారిగా 23,664.00 పాయింట్ల గరిష్ఠానికి పెరిగింది. చివరకు 36.30 పాయింట్ల నష్టంతో 23,521.60 వద్ద ముగిసింది. దాదాపు 1430 షేర్లు పురోగమించగా, 1969 షేర్లు పతనమయ్యాయి. 62 షేర్లు మాత్రం మారలేదు. నిఫ్టీలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ లాభపడ్డాయి. టైటాన్ కంపెనీ, మారుతీ సుజుకీ, ఎల్అండ్టీ, హిందాల్కో, భారతీ ఎయిర్టెల్ నష్టపోయాయి. బ్యాంకింగ్ రంగ షేర్లు రెండుశాతం లాభపడ్డాయి. ఐటీ 0.4శాతం పెరిగాయి. దాదాపు మిగతా అన్నిరంగాల షేర్లు నష్టపోయాయి. ఆటో, క్యాపిటల్ గూడ్స్, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, రియల్టీ ఒకటి నుంచి మూడు శాతం వరకు క్షీణించాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఒక శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం పతనమయ్యాయి.