Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. టారిఫ్ నుంచి పలు దేశాలకు ఊరట కల్పిస్తామన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంకేతాలతో స్టాక్ మార్కెట్లు ఉదయం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే సెన్సెక్స్ 78వేల పాయింట్లు దాటింది. ఈ క్రమంలో మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. దాంతో ఆరంభంలో వచ్చిన లాభాలన్నీ ఆవిరయ్యాయి. చివరలో స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ క్రితం సెషన్‌తో పోలిస్తే 78,296.28 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 78,741.69 పాయింట్ల గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్.. కనిష్ఠంగా 77,745.63 పాయింట్లను తాకింది.
చివరకు 32.8 పెరిగి 78,017.19 వద్ద ముగిసింది. నిఫ్టీ 10.30 పాయింట్లు పెరిగి.. 23,668.65 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో దాదాపు 1,019 షేర్లు పెరగ్గా.. 2,868 షేర్లు పతనమయ్యాయి. ఐటీ మినహా, మిగతా అన్ని రంగాల సూచీలు ఆటో, క్యాపిటల్ గూడ్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, మెటల్, ఆయిల్, గ్యాస్, పవర్, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ, టెలికాం షేర్లు ఒకటి నుంచి 1.5శాతం పతనమయ్యాయి. అల్ట్రాటెక్ సిమెంట్, ట్రెంట్, బజాజ్ ఫిన్సర్వ్, ఇన్ఫోసిస్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ నిఫ్టీలో లాభాలను ఆర్జించాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్ నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఒకశాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 1.6 శాతం పతనమయ్యాయి.