Stock Market Crash | దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఒక దశలో 1000 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్లకుపైగా పతనమయ్యాయి. గ్లోబల్ మార్కెట్లో ప్రతికూల పవనాలు, త్రైమాసిక ఫలితాల్లో కార్పొరేట్ కంపెనీల ఆదాయం తగ్గడం, విదేశీ నిధుల తరలింపు తదితర కారణాలతో మార్కెట్లు బుధవారం కుదేలయ్యాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 78,495.53 పాయింట్లు, నిఫ్టీ 23,822.45 వద్ద నష్టాల్లో మొదలైంది. ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేదు. సెన్సెక్స్ చివరకు 984.23 పాయింట్ల నష్టంతో 77,690.95 వద్ద ముగిసింది. నిఫ్టీ 324.40 పాయింట్లు పతనమై.. 23,559.05 వద్ద ముగిసింది. నిఫ్టీలో హీరో మోటోకార్ప్, హిందాల్కో, టాటా స్టీల్, ఎంఅండ్ఎం, ఐషర్ మోటార్స్ నష్టాల్లో కొనసాగగా.. ఎన్టీపీసీ, బ్రిటానియా ఇండస్ట్రీస్, హెచ్‌యుఎల్, టాటా మోటార్స్ లాభపడ్డాయి.
ఆటో, క్యాపిటల్ గూడ్స్, మెటల్, రియల్టీ, పవర్ మీడియా రెండు, మూడుశాతం పతనం కాగా.. అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 2.7 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3శాతం క్షీణించాయి. ఇదిలా ఉండగా.. ద్రవ్యోల్బణం పెరగంతో మార్కెట్ సెంటిమెంట్‌పై తీవ్ర ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. భారత్దేశ రిటైల్ ద్రవ్యోల్బణం 6.21శాతానికి పెరిగింది. సెప్టెంబర్‌లో 5.49శాతంగా నమోదైంది. 14 నెలల గరిష్ఠానికి పెరగడంతో మదుపరుల సెంటిమెంట్ దెబ్బతింది. ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంక్ అప్పర్ టాలరెన్స్ లెవెల్ కంటే ఎక్కువ. ఈ క్రమంలో మదుపరుల సెంటిమెంట్ దెబ్బతినడంతోపాటు డిసెంబర్లో జరిగే ద్రవ్య విధాన సమీక్షలో ఆర్బీఐ వడ్డీ రేట్లలో కోత విధించవచ్చన్న అంచనాలపై నీళ్లుచల్లినట్లయ్యింది.