ముంబై, జూలై 12: దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బేరిష్ ట్రెండ్ కొనసాగడంతోపాటు ఐటీ, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ రంగ షేర్లు కుదేలవడంతో వరుసగా రెండో రోజు సూచీలు పతనం చెందాయి. విదేశీ మదుపరులు వరుసగా పెట్టుబడులను ఉపసంహరించుకోవడం, రూపాయి రికార్డు స్థాయికి పతనమవడం మదుపరుల్లో సెంటిమెంట్‌ను నిరాశపరిచింది. రిటైల్ ధరల సూచీ, పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు విడుదలకానుండంతో మదుపరులు వేచిచూసే దోరణి అవలంభించారు. దీంతో 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 508.62 పాయింట్లు తగ్గి 53,886.61 పాయింట్లకు పడిపోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 157.70 పాయింట్లు కోల్పోయి 16,058.30 వద్ద ముగిసింది.
ఇన్ఫోసిస్ 2.33 శాతం తగ్గి టాప్ లూజర్‌గా నిలిచింది. దీంతోపాటు నెస్లె, పవర్‌గ్రిడ్, హెచ్‌యూఎల్, మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, ఏషియన్ పెయింట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, టైటాన్, ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, కొటక్ బ్యాంక్‌లు ఒక్క శాతానికి పైగా నష్టపోయాయి.
అలాగే హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మారుతి, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ, టీసీఎస్, ఐటీసీ, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, సన్‌ఫార్మా, బజాజ్ ఫిన్, ఎల్అండ్టీ, విప్రో, డాక్టర్ రెడ్డీస్, రిలయన్స్ కంపెనీల షేర్లు మదుపరులను ఆకట్టుకోలేకపోయాయి.
కేవలం ఎన్టీపీసీ, భారతీ ఎయిర్టెల్, బజాజ్ఫైనాన్స్లు మాత్రం అధికమయ్యాయి.
రంగాలవారీగా చూస్తే ఐటీ రంగం 1.29 శాతం, టెక్ 1.21 శాతం, మెటల్ 1.16 శాతం, ఆటో 1.13 శాతం, ఎఫ్ఎంసీజీ 1.03 శాతం, బ్యాంకింగ్, కన్జ్యూమర్ డ్యూరబుల్, క్యాపిటల్ గూడ్స్ రంగ షేర్లు నష్టపోయాయి. కానీ, టెలికం, యుటిలిటీ, పవర్, రియల్టీ రంగ షేర్లు పెరిగాయి.
అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ ధర 4 శాతం తగ్గి 100 డాలర్ల దిగువకు పడిపోయింది.
కొనసాగుతున్న రూపాయి పతనం
దేశీయ కరెన్సీ విలువ రికార్డు స్థాయికి పతనమైంది. అంతర్జాతీయ ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో మారకం విలువ ఆల్‌టైం కనిష్ఠ స్థాయికి జారుకున్నది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 14 పైసలు తగ్గి 79.59 వద్దకు పడిపోయింది. రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి రిజర్వు బ్యాంక్ చేసిన ప్రయత్నాలు బెడిసకొట్టాయి. అంతర్జాతీయ వాణిజ్యంలో రూపాయితో చెల్లింపులు జరుపనున్నట్లు ప్రకటించినప్పటికీ పతనాన్ని అడ్డుకోలేకపోయింది. ఒక దశలో 79.66 స్థాయికి పడిపోయిన విలువ చివరి వరకు ఇదే ట్రెండ్‌లో కొనసాగింది.