దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్సే ంజ్ సూచీ సెన్సెక్స్ 1,047.28 పాయింట్లు లేదా 1.84 శాతం పుంజుకుని 57,863.93 వద్ద నిలిచింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ సైతం 311.70 పాయింట్లు లేదా1.84 శాతం అందుకుని 17,287.05 వద్ద స్థిరపడింది.
ముంబై, మార్చి 17: అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీరేట్లను పెంచినప్పటికీ.. మదుపరులు అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలకే మొగ్గుచూపి పెట్టుబడులకు ఆసక్తి కనబర్చారు. దీంతో స్టాక్ మార్కెట్లు పరుగుల పెట్టాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపరుల నుంచి పెట్టుబడులు రావడం, డాలర్‌తో పోల్చితే రూపాయి బలపడటం కూడా కలిసొచ్చిందని మార్కెట్ వర్గాలు తాజా ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నాయి.
ఐటీ షేర్లు మినహా..
ఐటీ, టెక్నాలజీ షేర్లు మినహా రంగాలవారీగా అన్ని బీఎస్ఈ సూచీలు లాభాలనే అందిపుచ్చుకున్నాయి. రియల్టీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎనర్జీ, ఫైనాన్స్ రంగాల షేర్లు 3.14 శాతం మేర పెరిగాయి. సెన్సెక్స్‌లో హెచ్డీఎఫ్సీ షేర్ విలువ అత్యధికంగా 5.50 శాతం మేర పుంజుకున్నది. టైటాన్, కొటక్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, మారుతి షేర్లూ ఆకట్టుకున్నాయి. అయితే ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ షేర్లు 1.81 శాతం మేర తగ్గాయి. ఇక బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 1.18 శాతం లాభపడ్డాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 37 పైసలు పెరిగి 75.84 వద్ద నిలిచింది.
నేడు మార్కెట్లకు సెలవు
హోలీ సందర్భంగా శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లకు సెలవు. తిరిగి సోమవారం యథాతథంగా ట్రేడింగ్ కార్యకలాపాలు జరుగుతాయని అటు బీఎస్ఈ, ఇటు ఎన్ఎస్ఈ వర్గాలు తెలియజేశాయి.
కీలక ఆసియా మార్కెట్లన్నీ..
ఆసియా మార్కెట్లలో ప్రధాన సూచీలన్నీ లాభాల్లోనే కదలాడాయి. జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, చైనా సూచీలు లాభాల్లో ముగిశాయి. అయితే ఐరోపా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. ఇక్కడి మార్కెట్లపై రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం కనిపిస్తున్నది. ఇదిలావుంటే బుధవారం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లోనే ముగియగా, ఈ వారం మొత్తంగా సెన్సెక్స్ 2,313.63 పాయింట్లు (4.16%), నిఫ్టీ 656 పాయింట్లు (3.95%) పెరిగాయి.