ముంబై, జనవరి 2: రికార్డు స్థాయిలో దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు తిరోగమన బాట పట్టాయి. మదుపరులు ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గుచూపడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను ఉపసంహరించుకోవడంతో సూచీలు భారీగా నష్టపోయాయి. బ్యాంకింగ్, వాహన, ఐటీ రంగ షేర్లలో క్రయవిక్రయాలు జరగడం సూచీల ర్యాలీకి బ్రేక్‌పడింది. దీంతో మార్కెట్ ముగిసే సమయానికి 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 379.46 పాయింట్లు నష్టపోయి 72 వేల దిగువకు 71,892.48 పాయింట్లకు పడిపోయింది.
ఒక దశలో 658 పాయింట్లు నష్టపోయిన సూచీ చివర్లో ఈ భారీ నష్టాలను తగ్గించుకోగలిగింది. మరోసూచీ నిఫ్టీ 76.10 పాయింట్లు కోల్పోయి 21,665.80 వద్ద ముగిసింది. ఇటీవల కాలంలో భారీగా పెరిగిన బ్యాంకింగ్, వాహన, ఐటీ రంగ షేర్లు కుదుపునకు లోనయ్యాయి. కానీ, ఫార్మా, ఎనర్జీ రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో భారీ నష్టాలను నియంత్రించగలిగాయి.
మహీంద్రా టాప్ లూజర్
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా షేరు కుప్పకూలింది. మంగళవారం ట్రేడింగ్‌లో కంపెనీ షేరు ధర అత్యధికంగా 2.78 శాతం తగ్గి టాప్ లూజర్‌గా నిలిచింది. అల్ట్రాటెక్ సిమెంట్ 2.46 శాతం కోల్పోగా, కొటక్ బ్యాంక్ 2.41 శాతం, లార్సెన్ అండ్ టుబ్రో 2.36 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, విప్రో, హెచ్‌యూఎల్ షేర్లు నష్టపోయాయి. కానీ, సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫిన్సర్వ్, టైటాన్ షేర్లు లాభాల్లో ముగిశాయి. రంగాలవారీగా చూస్తే క్యాపిటల్ గూడ్స్ 1.42 శాతం, ఆటో 1.32 శాతం, బ్యాంకింగ్ 1.16 శాతం, రియల్టీ 1.04 శాతం, ఐటీ 1.03 శాతం, టెక్ షేర్లు పతనమవగా..ఎనర్జీ, హెల్త్‌కేర్, సేవలు, మెటల్ రంగ షేర్లు లాభాల్లో ముగిశాయి.