ముంబై, మార్చి 21: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదోరోజూ లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్ సూచీలు కదంతొక్కడంతోపాటు విదేశీ మదుపరులు నిధులు కుమ్మరించడం సూచీలు ఒక్క శాతానికి పైగా ఎగబాకాయి. ఈ ఏడాది అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను రెండు సార్లు తగ్గించే అవకాశాలుండటంతో మదుపరుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఫలితంగా కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో ఇంట్రాడేలో 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ మళ్లీ 77 వేల పాయింట్ల మైలురాయిని అధిగమించింది.
చివరకు వారాంతం మార్కెట్ ముగిసే సమయానికి సూచీ 557.45 పాయింట్ల లాభంతో 76,905.51 వద్ద స్థిరపడింది. మరో సూచీ నిఫ్టీ 159.75 పాయింట్లు అందుకొని 23,350.40 వద్ద ముగిసింది. మొత్తంమీద ఈ వారం లాభాలవారంగా నిలిచింది. గత ఐదు సెషన్లలో సెన్సెక్స్ 3,076.60 పాయింట్లు, నిఫ్టీ 953.20 పాయింట్లు లాభపడ్డాయి.
స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడుతుండటంతో మదుపరుల లక్షల కోట్ల సంపదను పోగేశారు. గడిచిన ఐదు రోజుల్లో రూ.22 లక్షల కోట్లకు పైగా వీరి సంపద పెరిగింది. దీంతో బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల విలువ రూ.22,12,191.12 కోట్లు పెరిగి రూ.4,13,30,624.05 కోట్లకు(4.79 ట్రిలియన్ డాలర్లు)కు చేరుకున్నది. గతంలో భారీ స్థాయిలో నిధులను వెనక్కితీసుకున్న ఎఫ్ఐఐలు ప్రస్తుతం భారీగా కుమ్మరిస్తుండటం సూచీలు పుంజుకోవడానికి ప్రధాన కారణమని జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.