ముంబై, అక్టోబర్ 24: వరుస నష్టాల్లో కదలాడుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు.. భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. సోమవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 825.74 పాయింట్లు లేదా 1.26 శాతం పతనమై 65 వేల మార్కుకు దిగువన 64,571.88 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 894.94 పాయింట్లు పడిపోయింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ సైతం 260.90 పాయింట్లు లేదా 1.34 శాతం క్షీణించి 19,281.75 వద్ద నిలిచింది. దీంతో నాల్గోరోజూ సూచీలు కోలుకోనైట్టెంది. మరోవైపు ఈ ఒక్కరోజే మదుపరుల సంపద లక్షల కోట్ల రూపాయల్లో ఆవిరైపోయింది.
ఆరంభం బాగానే ఉన్నా..
ఉదయం ఆరంభంలో మార్కెట్లు లాభాల్లోనే మొదలయ్యాయి. అయితే మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల భయాలు మదుపరులను చుట్టుముట్టాయి. ఇజ్రాయెల్-హమాస్ మిలిటెంట్ల మధ్య యుద్ధం పెట్టుబడుల ఉపసంహరణకు దారితీసింది. ఇప్పటికే ఉన్న రష్యా-ఉక్రెయిన్ ఆందోళనకర పరిస్థితులకు మిడిల్ ఈస్ట్ టెన్షన్లూ తోడవడంతో మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతిన్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే సమయం గడుస్తున్నకొద్దీ నష్టాలు పెరుగుతూపోయాయని చెప్తున్నారు. ఇక అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల నష్టాలూ.. భారతీయ ఈక్విటీల క్షీణతకు ఓ కారణమేనని పేర్కొంటున్నారు.
ముడి చమురు సెగ
ఇజ్రాయెల్-హమాస్ ఉద్రిక్తతలు.. మిడిల్ ఈస్ట్ వాతావరణాన్ని మరింతగా వేడెక్కిస్తున్నాయి. ఈ క్రమంలోనే ముడి చమురు ధరలూ పైపైకి వెళ్తున్నాయి. బ్యారెల్ క్రూడాయిల్ రేటు మళ్లీ 90 డాలర్లను దాటింది. హమాస్ మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు ఇంకా కొనసాగుతుండటంతో ముడి చమురు ధరలు మరింత పెరిగే వీలుందన్న అంచనాలే వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే భారతీయ స్టాక్ మార్కెట్లపై ఒత్తిడి తీవ్రతరం కావడం ఖాయమంటున్నారు.
మిడ్-స్మాల్‌క్యాప్ షేర్లూ..
లార్జ్‌క్యాప్ షేర్లే కాదు.. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లూ నష్టాలకు లోనయ్యాయి. మదుపరులు లాభాల స్వీకరణకే మొగ్గు చూపుతుండటంతో అన్ని రకాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. దీంతో బీఎస్ఈ మిడ్‌క్యాప్ సూచీ 2.51 శాతం, స్మాల్‌క్యాప్ సూచీ 4.18 శాతం పడిపోయాయి. రంగాలవారీగా టెలికం అత్యధికంగా 3.82 శాతం, ఇండస్ట్రియల్స్ 3.26 శాతం, యుటిలిటీస్ 3.10 శాతం, కమోడిటీస్ 3.06 శాతం, సర్వీసెస్ 2.99 శాతం, రియల్టీ 2.84 శాతం, పవర్ 2.69 శాతం, కన్జ్యూమర్ డిస్రియేషనరీ 2.25 శాతం, ఐటీ 2.14 శాతం, చమురు గ్యాస్ 1.88 శాతం చొప్పున క్షీణించాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా మోటర్స్, టాటా స్టీల్, టీసీఎస్, ఎన్టీపీసీ, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎస్బీఐ, ఎల్అండ్టీ, అల్ట్రాటెక్, ఇండస్ఇండ్, కొటక్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి.
అంతర్జాతీయంగా..
అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో ప్రధాన సూచీలైన దక్షిణ కొరియా, జపాన్, చైనా నష్టపోయాయి. ఐరోపాలోని కీలక సూచీలైన బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ కూడా నిరాశపర్చాయి. అమెరికా మార్కెట్లూ నేలచూపుల్నే చూస్తున్నాయి. దీంతో ఈ ప్రభావం భారతీ య స్టాక్ మార్కెట్లపైనా పడుతున్నదని మెజారిటీ మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
రూ.7.59 లక్షల కోట్లు ఆవిరి
స్టాక్ మార్కెట్ల భారీ నష్టాలతో మదుపరుల సంపద కూడా పెద్ద ఎత్తునే కరిగిపోయింది. బీఎస్ఈలో నమోదైన కంపెనీల మార్కెట్ విలువ సోమవారం ఒక్కరోజే రూ.7,59,041.63 కోట్లు హరించుకుపోయింది. అంతకుముందు మూడు రోజులూ సంపద తరిగిపోగా.. వరుసగా ఈ నాలుగు రోజుల్లో ఆయా సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.12,51,700.73 కోట్లు క్షీణించింది. ఫలితంగా బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ రూ.3,11,30, 724.40 కోట్లకు పరిమితమైంది. గత నాలుగు రోజుల్లో సెన్సెక్స్ 1,925 పాయింట్లు లేదా 2.79 శాతం పతనమైం ది. నిఫ్టీ సైతం సుమారు 530 పాయింట్లు కోల్పోయింది.