Stocks | అంతర్జాతీయ మార్కెట్లలో పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నా దేశీయ స్టాక్ మార్కెట్లు 2025లో తొలి రోజుబుధవారం లాభాలతో శుభారంభాన్ని అందుకున్నాయి. బీఎస్ఈ -30 ఇండెక్స్ సెన్సెక్స్ 368.40 పాయింట్ల లబ్ధితో 78,507.41 పాయింట్ల వద్ద ముగిసింది. అంతర్గత ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 78,756.49 పాయింట్ల నుంచి 77,898.30 పాయింట్ల మధ్య తచ్చాడింది. మరోవైపు, ఎన్ఎస్ఈ-50 సూచీ నిప్టీ 98.10 పాయింట్ల లాభంతో 23,742.90 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో 23,562.80 పాయింట్ల కనిష్ట స్థాయి నుంచి 23,822.80 పాయింట్ల గరిష్టానికి దూసుకెళ్లాయి. ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్ మీద రూపాయి మారకం విలువ రూ.85.64 వద్ద ముగిసింది. ఆటోమొబైల్, కన్జూమర్ డ్యూరబుల్స్, ఫైనాన్సియల్స్, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లాభ పడ్డాయి.
ఎన్ఎస్ఈ-50లో 37 స్టాక్స్ లాభాల్లోనే ముగిశాయి. మారుతి సుజుకి ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, లార్సెన్ అండ్ టర్బో, టాటా మోటార్స్ తదితర సంస్థలు 3.01 శాతం లాభ పడ్డాయి. మరోవైపు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హిందాల్కో, అదానీ పోర్ట్స్, ఓఎన్జీసీ, టాటా స్టీల్ సహా 13 స్టాక్స్ 1.40 శాతం వరకూ నష్టపోయాయి. బ్రాడర్ మార్కెట్లు నిఫ్టీ మిడ్ క్యాప్-100 0.44 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 1.02 శాతం లాభ పడ్డాయి. నిఫ్టీలో రియాల్టీ, ఫార్మా మినహా అన్ని సెక్టార్లు లాభాలతో ముగిశాయి. నిఫ్టీ ఆటో గరిష్టంగా 1.34 శాతం లాభ పడింది.
బీఎస్ఈ సెన్సెక్స్‌లో 30 స్టాక్స్ కు గాను 23 స్టాక్స్ లాభాలతో స్థిర పడ్డాయి. మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా, లార్సెన్ అండ్ టర్బో, టాటా మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, పవర్ గ్రిడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ సహా లాభ పడ్డాయి. మరోవైపు హిందూస్థాన్ యూనీ లివర్, టెక్ మహీంద్రా, హెచ్ సీఎల్ టెక్, జొమాటో, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్ నష్టాలతో ముగిశాయి. సుజ్లాన్, రిలయన్స్ ఇన్ ఫ్రా, జీఎంఆర్ పవర్, సీక్వెంట్, రిలయన్స్ పవర్ సహా 317 స్టాక్స్ అప్పర్ సర్క్యూట్ తాకాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్-100 సూచీ 1.03, బీఎస్ఈ మిడ్ క్యాప్-100 సూచీ 0.50 శాతం లాభ పడ్డాయి.