Stock Market | స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. మార్కెట్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ద్రవ్యోల్బణం గణాంకాల ఆధారంగా ఉదయం మార్కెట్లు లాభాల్లో మొదలయ్యాయి. అయితే, చివరి వరకు అదే ఊపును కొనసాగించడంలో విఫలమయ్యాయి. తొలి సెషన్లో సూచీలు పైకి కదిలినా.. మధ్యాహ్నం తర్వాత లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో పతనమయ్యాయి. మళ్లీ మార్కెట్లు ఏ దశలోనూ కోలుకోలేదు. సెన్సెక్స్ 82,404.54 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది.
ఇంట్రాడేలో 82,573.37 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. కనిష్టంగా 81,781.62 పాయింట్లకు పడిపోయింది. చివరకు 297.07 పాయింట్ల నష్టంతో 82,029.98 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 81.85 పాయింట్లు తగ్గి.. 25,145.50 పాయింట్ల వద్ద స్థిరపడింది. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.8 శాతం క్షీణించగా.. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1శాతం పడిపోయింది. అన్ని రంగాల సూచీలు ఫార్మా, కన్స్యూమర్ డ్యూరబుల్స్, మెటల్, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ ఒకటి నుంచి 1.5శాతం తగ్గాయి. నిఫ్టీలో డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, బజాజ్ ఫైనాన్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, టీసీఎస్, ట్రెంట్ ప్రధానంగా నష్టాలను చవిచూశాయి. మాక్స్ హెల్త్‌కేర్, అపోలో హాస్పిటల్స్, టెక్ మహీంద్రా, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్ లాభపడ్డాయి.