హైదరాబాద్, ఫిబ్రవరి 12: రాష్ర్టానికి చెందిన ప్రముఖ విత్తనాల తయారీ సంస్థ కావేరీ సీడ్స్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.15.04 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.11.66 కోట్ల లాభంతో పోలిస్తే 29 శాతం వృద్ధిని కనబరిచింది. అలాగే సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.118.47 కోట్ల నుంచి రూ.154.77 కోట్లకు ఎగబాకినట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది.
ప్రస్తుతం కంపెనీ చేతిలో రూ.499 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జీవీ భాస్కర్ రావు మాట్లాడుతూ.. గత త్రైమాసికంలో ఆశాజనక పనితీరు కనబరిచినట్లు, వరి-మొక్కజొన్న విత్తనాలకు డిమాండ్ నెలకొన్నదన్నారు. అలాగే గత త్రైమాసికంలో ఎగుమతులు రూ.38.10 కోట్ల నుంచి రూ.18.23 కోట్లకు పడిపోయాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చిత పరిస్థితులు నెలకొనడం వల్లనే ఎగుమతులు నీరసించాయని చెప్పారు. ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్యకాలానికిగాను రూ.1,044.61 కోట్ల ఆదాయంపై రూ.294.46 కోట్ల లాభాన్ని గడించింది.