Investers Wealth | మంగళవారం దేశీయ స్టాక్‌మార్కెట్లు కళకళలాడాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ఇండెక్స్ 1564.45 పాయింట్ల లబ్ధితో 59,537.07 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ ఏడాదిలో ఇది రెండో గరిష్టం. ఇంతకుముందు గత ఫిబ్రవరి 15న బీఎస్ఈ సెన్సెక్స్ 1736 పాయింట్లు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (నిఫ్టీ) సూచీ 510 పాయింట్ల లబ్ధితో ముగిసింది. మంగళవారం నిఫ్టీ 446.40 పాయింట్లు లాభ పడి 17,759.30 పాయింట్ల వద్ద స్థిరపడింది. బీఎస్ఈ-30 ఇండెక్స్‌లో అన్ని స్టాక్స్ లాభాలతోనే ముగిశాయి. మంగళవారం స్టాక్ మార్కెట్లు 2.5 శాతానికి పైగా ర్యాలీ కావడంతో ఇన్వెస్టర్ల సంపద రూ.5.68 లక్షల కోట్లు పెరిగింది.
బజాజ్ ఫిన్సర్వ్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, మారుతి సుజుకి, టాటా స్టీల్, ఎన్టీపీసీ, ఆల్ట్రా టెక్ సిమెంట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), యాక్సిస్ బ్యాంక్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. మరోవైపు నిఫ్టీలో డాక్టర్ రెడ్డీస్ భారీగా పతనమైంది. అదానీ గ్రూప్ సంస్థల షేర్లన్నీ బలపడ్డాయి. దీంతో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ ప్రపంచంలోనే మూడో కుబేరుడిగా అవతరించారు. అదానీ గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్సిమిషన్ స్క్రిప్ట్‌లు 52 వారాల గరిష్టాన్ని తాకాయి.
ఎన్ఎస్ఈలో 11 సెక్టోరల్ ఇండెక్స్‌లు లాభాలతో ముగిశాయి. రియాల్టీ సెక్టార్ 3.49 శాతం లాభ పడింది. తర్వాత బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థల షేర్లు మూడు శాతానికి పైగా లాభపడ్డాయి. ఆటో, ఎఫ్ఎంసీజీ, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్, మెటల్ స్టాక్స్ రెండు శాతానికి పైగా పుంజుకున్నాయి. ఫార్మా, మీడియా షేర్లు ఒక శాతానికి పైగా లబ్ధి పొందాయి.
సోమవారం భారీగా నష్టపోయిన నేపథ్యంలో మంగళవారం స్టాక్ మార్కెట్లలో రికవరీ నమోదు కావడం గమనార్హం. బ్యాంకింగ్ స్టాక్స్ ప్రారంభ దశలో లాభాలు గడించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 488.4 పాయింట్ల లబ్ధితో 58,461.02 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మొదలైంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ అత్యధికంగా 154.55 పాయింట్లతో ప్రారంభమైంది. గణేశ్ చతుర్థి సందర్భంగా బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లకు సెలవు.