ముంబై, జూలై 21: మార్కెట్ రెగ్యులేటర్ సెబీ సోమవారం మదుపరులను హెచ్చరించింది. అక్రమ, నియంత్రణలో లేని మార్కెట్ ట్రేడింగ్ కార్యకలాపాలపట్ల అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది. ఓ హిందీ దినపత్రికలో డబ్బా ట్రేడింగ్ కంపెనీ ఈ నెల 13న ఫుల్ పేజీ వాణిజ్య ప్రకటన ఇచ్చింది. ఇందులో డాక్యుమెంటేషన్‌తో పనిలేకుండా రిజిస్ట్రేషన్, ఆపై పెద్ద మొత్తాల్లో ఆకర్షణీయ లాభాలను అందుకోవచ్చని ఉన్నది. అయితే సదరు సంస్థపై, దానితో ప్రమేయమున్నవారిపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలంటూ సైబర్ పోలీసులకు ఫిర్యాదు అందింది.
ఈ నేపథ్యంలోనే సెబీ పైవిధంగా స్పందించింది. ఇల్లీగల్ ట్రేడింగ్ సర్వీసులను ఆఫర్ చేసే ఏ సంస్థతోనూ ఎలాంటి లావాదేవీలను జరిపి ఇన్వెస్టర్లు నష్టపోవద్దన్నది. గత వారం నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సైతం మదుపరులను ఇదే తరహాలో హెచ్చరించిన విషయం తెలిసిందే.
ఇదిలావుంటే డబ్బా ట్రేడింగ్ కంపెనీ ఇచ్చిన ప్రకటన.. అడ్వైర్టెజింగ్ ప్రమాణాలకు విరుద్ధంగా ఉందా? అన్న కోణంలో పరిశీలించాలని అడ్వైర్టెజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ)కూ సెబీ సలహా ఇచ్చింది. ఏదైనా ఉల్లంఘన జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలన్నది. స్టాక్ ఎక్సేంజీలు, రెగ్యులేటరీ వ్యవస్థ పరిధికి అవతల ఈ డబ్బా ట్రేడింగ్ సాగుతున్నట్టు సెబీ చెప్తున్నది.