న్యూఢిల్లీ, ఆగస్టు 18 : అతి భారీ సంస్థల కోసం మినిమం పబ్లిక్ ఆఫర్ (ఎంపీవో) పరిమాణంపైనున్న నిబంధనల్ని సడలించాలని సోమవారం క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ ప్రతిపాదించింది. అలాగే మినిమం పబ్లిక్ షేర్‌హోల్డింగ్ (ఎంపీఎస్) నిబంధనల అమలుకున్న సమయాన్ని కూడా పొడిగించాలని నిర్ణయించింది. పబ్లిక్ ఇష్యూకు వచ్చే బడా సంస్థలు వాటాల అమ్మకానికి సంబంధించి ఎదుర్కొంటున్న ఒత్తిడిని తొలగించడానికే ఇదంతా. భారీగా వాటాలను అమ్మకానికి తేవడం ఓ సమస్యగా మారుతున్నది మరి. మార్కెట్లో ఆ స్థాయిలో ఇన్వెస్టర్ల నుంచి షేర్ల కొనుగోలుకు డిమాండ్ రాక నష్టాలు లేదా వైఫల్యాలు ఎదురవుతున్నాయి. ఫలితంగా ఆయా సంస్థలు దేశీయ మార్కెట్లలోకి ప్రవేశించలేకపోతున్నాయి. అందుకే పబ్లిక్ ఇష్యూకు ఇంత వాటా అమ్మకం తప్పనిసరి అన్న నిబంధనను తీసేయాలని సెబీ చూస్తున్నది. అయితే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)లో రిటైల్ కోటాను 35 శాతంగా యథాతథంగానే ఉంచింది. ఈ మేరకు తాజా కన్సల్టేషన్ పేపర్లో సెబీ పేర్కొన్నది.
ప్రస్తుతం రూ.50 వేల కోట్లు-లక్ష కోట్ల మధ్య మార్కెట్ విలువ ఉన్న సంస్థలు కనీసం వెయ్యి కోట్ల రూపాయలతో పబ్లిక్ ఇష్యూకు రావాల్సి ఉంటుంది. పోస్ట్-ఇష్యూ క్యాపిటల్ 8 శాతంగా ఉండాలి. 25 శాతం ఎంపీఎస్ లక్ష్యాన్ని ఐదేండ్లలో చేరుకోవాలి. అలాగే లక్ష కోట్లు-రూ.5 లక్షల కోట్ల మధ్య మార్కెట్ విలువ ఉంటే ఇవి వరుసగా రూ.6,250 కోట్లు, 2.75 శాతంగా ఉన్నాయి. పబ్లిక్ ఇష్యూ సమయంలో ఎంపీఎస్ 15 శాతం లోపుంటే ఐదేండ్లలో 15 శాతానికి చేరుకోవాలి. 10 ఏండ్లలో ఎంపీఎస్‌ను 25 శాతానికి చేర్చాలి. ఒకవేళ లిస్టింగ్‌లోనే ఎంపీఎస్ 15 శాతంగా ఉంటే.. ఐదేండ్లలో దాన్ని 25 శాతానికి పెంచాలి. రూ.5 లక్షల కోట్ల కంటే ఎక్కువ మార్కెట్ విలువ ఉన్న సంస్థలు కనీసం రూ.15 వేల కోట్ల పబ్లిక్ ఆఫర్‌తో రావాలి. పోస్ట్-ఇష్యూ క్యాపిటల్ కనీసం 1 శాతంగా ఉండాలి. ఎంపీఎస్ 15 శాతంగా ఉంటే ఐదేండ్లలో 25 శాతానికి పెంచాలి. 15 శాతం లేకుంటే 10 ఏండ్లలో 25 శాతానికి చేర్చాలి.
రూ.1,600 కోట్లదాకా మార్కెట్ విలువ ఉన్న సంస్థలు.. ఐపీవోకు వచ్చేటప్పుడే కనీసం 25 శాతం పబ్లిక్ షేర్‌హోల్డింగ్ నిబంధనను పాటించాలి. రూ.1,600 కోట్లు-లక్ష కోట్ల మధ్య విలువ ఉంటే.. ఎంపీవో 10-25 శాతంగా ఉండొచ్చు. అయితే 3-5 ఏండ్లలో 25 శాతం ఎంపీఎస్‌ను అందుకోవాలి. ఇక వచ్చే నెల 8దాకా సెబీ తమ ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయాన్ని కోరుతున్నది.