Infosys-SEBI | ఇన్ఫోసిస్ ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసులో స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇన్ఫోసిస్ మాజీ ఉద్యోగులు సహా 16 సంస్థలపై ఇంతకు ముందు విధించిన ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. అమిత్ భుత్రా, భారత్ సీ జైన్, క్యాపిటల్ వన్ పార్టనర్స్, టెసోరా క్యాపిటల్, మనీష్ సీ జైన్, అంక్రుష్ భుత్రాలతో కూడిన ఆరు సంస్థలపై విధించిన నిషేధం ఎత్తేస్తున్నట్లు తెలిపింది. 2019 డిసెంబర్ నుంచి 2020 సెప్టెంబర్ వరకూ నాలుగు త్రైమాసికాల కాలంలో ‘అనుమానాస్పద ట్రేడింగ్’ జరిగినట్లు సెబీ గుర్తించిన తర్వాత 16 సంస్థల ట్రేడింగ్ మీద ఆంక్షలు విధించింది. సంబంధిత సంస్థలపై ఆరోపణలకు సరైన సాక్షాధారాలు లభించక పోవడంతోపాటు 2022 ఏప్రిల్ 25 నాటి ‘శాట్’ ఆదేశాలకు అనుగుణంగా ఆంక్షలు ఎత్తేస్తున్నట్లు సెబీ వెల్లడించింది.