SBI Q1 Results | దేశంలోకెల్లా అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ మార్కెట్ అంచనాలను బ్రేక్ చేసింది. గతేడాదితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికం నికర లాభాల్లో 178.24 శాతం గ్రోత్ నమోదు చేసింది. 2022-23 తొలి త్రైమాసికంలో రూ.6,068 కోట్ల నికర లాభం సముపార్జించింది.
ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో ఎస్బీఐ రూ.15 వేల కోట్ల నికర లాభం గడిస్తుందని మార్కెట్ వర్గాలు భావించగా, రూ.16,884 కోట్ల నికర లాభం గడించినట్లు బ్యాంకు తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం తర్వాత ఎస్బీఐ సాధించిన నికర లాభాల్లో గరిష్టం అని తేలింది.
ఎస్బీఐ నికర వడ్డీ ఆదాయం 24.7 శాతం పెరిగి రూ.38,905 కోట్లకు చేరుకున్నది. బ్యాంకు స్థూల మొండిబకాయిలు గతేడాదితో పోలిస్తే 3.9 శాతం నుంచి 2.76 శాతానికి, మార్చి త్రైమాసికంతో పోలిస్తే 2.78 నుంచి 2.76 శాతానికి తగ్గాయి.
2022-23 తొలి త్రైమాసికంలో స్థూల మొండి బకాయిలు రూ.1,13,271.72 కోట్లు కాగా, ఈ ఏడాది రూ.91,327.84 కోట్లకు తగ్గింది. గతేడాది జూన్ త్రైమాసికంలో రూ.74,989 కోట్ల ఆదాయం గడించిన ఎస్బీఐ.. ఈ ఏడాది రూ.1,08,039 కోట్లకు పెరిగిందని ఎస్బీఐ వెల్లడించింది.