న్యూఢిల్లీ, డిసెంబర్ 12: బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రుణ గ్రహీతలకు శుభవార్తను అందించింది. అన్నిరకాల రుణాలపై వడ్డీరేటును పావు శాతం తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. రిజర్వు బ్యాంక్ రెపోరేటును పావుశాతం తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకున్నది. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లింక్డ్ రేటు(ఈబీఎల్ఆర్) 25 బేసిస్ పాయింట్లు కోత పెట్టనుండటంతో రుణాలపై వడ్డీరేటు 7.90 శాతానికి దిగిరానున్నది.
తగ్గించిన వడ్డీరేట్లు ఈ నెల 15 నుంచి అమలులోకి రానున్నట్టు బ్యాంక్ ఒక ప్రకటనలో వెల్లడించింది. అలాగే బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని కూడా 5 బేసిస్ పాయింట్లు కోత విధించింది. దీంతో ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై ఎంసీఎల్ఆర్ 8.75 శాతం నుంచి 8.70 శాతానికి దిగిరానున్నది. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఈఎంఐ చెల్లింపులు మరింత తగ్గనున్నాయి.