ముంబై, నవంబర్ 4: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను రూ.21,137 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.18,331 కోట్లతో పోలిస్తే 10 శాతం వృద్ధిని కనబరిచింది. యెస్ బ్యాంక్‌లో వాటాను విక్రయించడంతో రూ.4,593 కోట్ల నిధులు సమకూరడం వల్లనే లాభాల్లో భారీ వృద్ధి నమోదైందని పేర్కొంది. అలాగే జూలై-సెప్టెంబర్ మధ్యకాలంలో నమోదైన రూ.20,160 కోట్ల కంటే స్వల్ప వృద్ధిని నమోదు చేసుకున్నది.
సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.1,63,802 కోట్ల నుంచి రూ.1,75,898 కోట్లకు చేరుకున్నది. దీంట్లో వడ్డీల మీద వచ్చే ఆదాయం రూ.1,19,654 కోట్లకు చేరుకున్నట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది. బ్యాంక్ మరో చరిత్రను సృష్టించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరినాటికి బ్యాంక్ మొత్తం వ్యాపారం రూ.100 లక్షల కోట్లను తాకింది. దీంతో ఆస్థుల పరంగా అంతర్జాతీయంగా 43వ అతిపెద్ద బ్యాంక్‌గా ఎస్బీఐ అవతరించింది.
ఇటీవలకాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలు, జీఎస్టీని హేతుబద్దీకరించడం, ఆదాయ పన్నుల్లో మార్పులు, రిజర్వుబ్యాంక్ సడలింపులతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12-14 శాతం మధ్యలో బ్యాంక్ వృధిని సాధించనున్నది. జీఎస్టీ రేట్ల కోతతో రుణాలకు డిమాండ్ భారీగా పెరిగిందని, ముఖ్యంగా వాహన రంగంలో కనిపించింది.
– సీఎస్ శెట్టి, ఎస్బీఐ చైర్మన్