శనివారం 05 డిసెంబర్ 2020
Business - Oct 22, 2020 , 01:26:06

ఎస్బీఐ బంపర్‌ ఆఫర్‌

ఎస్బీఐ బంపర్‌ ఆఫర్‌

ముంబై: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) గృహరుణాలపై భారీ రాయితీ ప్రకటించింది. తన డిజిటల్‌ వ్యాపార మాధ్యమం యోనో యాప్‌ ద్వారా రూ.75 లక్షలకుపైగా గృహ రుణాలు తీసుకునేవారికి సిబిల్‌ స్కోరు ఆధారంగా వడ్డీలో 25 బేసిస్‌ పాయింట్ల రాయితీ ఇవ్వనున్నట్టు వెల్లడించింది. అంతేకాకుండా పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని గృహ రుణాలపై ఇటీవల ప్రకటించిన రాయితీలను పొడిగించింది. రూ.30 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు గృహ రుణాలను తీసుకునే ఖాతాదారులకు క్రెడిట్‌ స్కోరు ఆధారంగా ప్రస్తుతం వడ్డీలో ఇస్తున్న 10 బేసిస్‌ పాయింట్ల రాయితీని 20 బేసిస్‌ పాయింట్లకు పెంచింది. ఎనిమిది మెట్రో నగరాల్లో రూ.3 కోట్ల వరకు గృహ రుణాలు తీసుకునే కస్టమర్లకు కూడా 20 బేసిస్‌ పాయింట్ల రాయితీ వర్తిస్తుందని, యోనో యాప్‌ ద్వారా గృహ రుణాలు తీసుకునే కస్టమర్లకు అదనంగా మరో 5 బేసిస్‌ పాయింట్ల రాయితీ లభిస్తుందని ఎస్బీఐ  వివరించింది. ప్రస్తుతం రూ.30 లక్షల్లోపు గృహ రుణాలను 6.90 శాతం వడ్డీతో ఆఫర్‌ చేస్తున్న ఎస్బీఐ.. రూ.30 లక్షల కంటే ఎక్కువ రుణాన్ని తీసుకున్న ఖాతాదారుల నుంచి 7 శాతం వడ్డీ వసూలు చేస్తున్నది. 

యెస్‌ బ్యాంక్‌ కూడా..

యెస్‌ బ్యాంక్‌ కూడా రుణాలపై వసూలు చేస్తున్న ప్రాసెసింగ్‌ ఫీజుపై రాయితీతోపాటు అతి తక్కువ ఈఎంఐ, గిఫ్ట్‌ వోచర్లు, క్యాష్‌బ్యాక్‌లు అందిస్తున్నది. ద్విచక్ర, ఆటోలను కొనుగోలు చేసేవారు 100 శాతం రుణం తీసుకునే అవకాశం కల్పించింది.