కొత్త సంవత్సరం వచ్చింది. పొదుపు, మదుపునకు ఇదే సమయం. మరి నిపుణులు ఏం చెప్తున్నారో తెలుసా?చిన్నచిన్నగానైనా..
మనలో చాలామంది ఈ కాస్త నగదు కూడబెడితే ఒనగూరేదేంటి? అన్న చులకన భావనలో ఉంటారు. సేవింగ్స్ అంటే పెద్ద మొత్తాల్లోనే చేయాలని, అప్పుడే ఆఖర్లో భారీగా నగదును పొందవచ్చన్న భ్రమలో ఉండిపోతారు. అయితే మీ దగ్గర మిగిలేది చిన్న మొత్తమైనా.. దాన్ని సేవింగ్స్‌గా మార్చుకోవడమే తెలివి. ప్రతి నెలా ఇంత? అంటూ లెక్కలు వేసుకొని, దాన్ని అందుకోనప్పుడు నిరాశపడే బదులుగా.. ఈ నెల ఇంతే అయినా.. వచ్చే నెలా ఇంకాస్త పొదుపు చేద్దాం అన్న ఆశతో ముందుకెళ్తే విజయం మీదే. బంగారం, వెండిపై పెట్టుబడులనూ పరిశీలించవచ్చు. ఇటీవలికాలంలో వాటి ధరలు ఏ స్థాయిలో పరుగులు పెడుతున్నాయో? ప్రత్యేకం చెప్పనక్కర్లేదు.
చదువు
పిల్లల చదువులకయ్యే ఖర్చులు అన్నీఇన్నీ కావు. మధ్యతరగతి ప్రజలు తమ ఆదాయంలో ఎక్కువగా వెచ్చించేది తమ బిడ్డల చదువులకే. మంచి చదువులు చెప్పిస్తే వారి భవిష్యత్తు ఢోకా ఉండదన్న ఆశ మరి. అందుకే కొత్తగా పైండ్లెన జంటలు లేదా ఈమధ్యే తల్లిదండ్రులైనవారు ఇప్పట్నుంచే పిల్లల చదువుకయ్యే ఖర్చుల దృష్యా సేవింగ్స్‌కు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. చాలామంది పిల్లలు ఇంకా బడికి వెళ్లట్లేదు కదా? అని ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ ఆ రకమైన తీరు ఎంతమాత్రం సరికాదు.
సొంతిల్లు
సొంతింటి కల సాకారం కోసం చాలామంది ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయితే సంపాదన ఆరంభమైన తొలినాళ్లలోనే ఈ లక్ష్య సాధన కోసం ఓ చక్కని ప్లానింగ్‌తో ముందుకెళ్తే మంచిది. ఇందుకు దీర్ఘకాలిక పెట్టుబడులను ఎంచుకోవచ్చు. ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ సలహాలతో స్టాక్ మార్కెట్లు, గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ బాండ్లు ట్రై చేయవచ్చు. అయితే మార్కెట్ ఒడిదుడుకులకులోనై ఇవి ఉంటాయన్న విషయాన్ని మరువద్దు. ఇక ఓపెన్ ప్లాట్లనూ కొనుగోలు చేయవచ్చు. అయితే అక్కడి మార్కెట్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకోవాలి.
బీమా
ప్రతి మనిషికీ బీమా చాలా అవసరం. అది జీవిత బీమా అయినా.. ఆరోగ్య బీమా అయినా.. ఏదైనాసరే ఈ విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహించవద్దు. ఇక చిన్న వయసు నుంచే బీమా తీసుకుంటే తక్కువ ప్రీమియం, ఎక్కువ రాబడులుంటాయి. టర్మ్ ఇన్సూరెన్స్లనూ పరిశీలించవచ్చు. అయితే ఆరోగ్య బీమా విషయంలో చాలామంది ఏదో ఒక బీమా ఉంటే ఉందన్నట్టు వ్యవహరిస్తుంటారు. కానీ సమగ్ర రీతిలో ఆరోగ్య బీమా ఉండాల్సిందే. అరకొర బీమా సాయంతో అప్పులపాలయ్యే ప్రమాదం ఉన్నది. మొత్తంగా చెప్పాలంటే మనం లేని రోజున మనవాళ్లకు అండగా నిలిచేలా బీమా సాయం రావాలి.