హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): కొత్త సంవత్సరం వస్తే జీవితాల్లో వెలుగులు నిండుతాయని ఆశించిన వేల మంది గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బందికి నిరాశే ఎదురైంది. క్యాలెండర్లు మారినా వారి తలరాతలు మారడం లేదు. పండుగ పూట కూడా పస్తులుండాల్సిన పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖలో వివిధ విభాగాల్లో సుమారు 92 వేల మందికిపైగా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరికి ఐదు నెలలుగా వేతనాలు నిలిచిపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచింది.
రాష్ట్ర అభివృద్ధిలో కీలకపాత్ర పోషించే ఈ శాఖ సిబ్బందిపై ప్రభుత్వం చూపుతున్న వివక్ష ఆందోళన కలిగిస్తున్నది. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వివిధ విభాగాల్లో సుమారు 13 వేల మంది పనిచేస్తున్నారు. వీరిలో కొందరికి ఐదు నెలలుగా, మరికొందరికి మూడు నెలలుగా వేతనాలు లేదు. ఫీల్డ్ అసిస్టెంట్లకు గత ఆగస్టు నుంచి వేతనాలు అందడం లేదు. ఏపీవో, ఈసీ, సీవో, టెక్నికల్ అసిస్టెంట్లు, అటెండర్లు.. వీరికి అక్టోబర్ నుంచి జీతాలు నిలిచిపోయాయి.
మల్టీపర్పస్ ఉద్యోగులకు
గ్రామ పంచాయతీల పరిధిలో పనిచేసే మల్టీపర్పస్ సిబ్బందికి కూడా మూడు నెలలుగా వేతనాలు అందడం లేదు. ఈ శాఖలో 52,473 మంది పనిచేస్తున్నారు. చెత్త సేకరణ, వీధిలైట్లు, నీటి సరఫరా, మొక్కలకు నీళ్ల పోయడం వంటి అనేక పనులు వీరు చేస్తున్నారు. వీరి ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గ్రామాల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరినప్పటికీ తమ కష్టాలు పట్టించుకొనేవారేలేరని మల్టీపర్పస్ ఉద్యోగులు వాపోతున్నారు. సంక్రాంతి వంటి పెద్ద పండుగకు చేతిలో చిల్లిగవ్వలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పీఆర్ఆర్డీ శాఖలో పనిచేస్తున్న 92 వేల పైచిలుకు సిబ్బందికి ప్రతినెలా వేతనాలకు రూ.115 కోట్లు అవసరం అవుతాయని, గ్రీన్ చానెల్ ద్వారా నిధులు విడుదల చేసి వేతనాలు చెల్లిస్తామన్న ప్రభుత్వ హామీలు కేవలం మాటలకే పరిమితమయ్యాయని మల్టీపర్పస్ ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు.
ఎన్నికల సమయంలోనూ, ఆ తర్వాత గ్రామీణ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందనే ఆరోపణలు ఉన్నాయి. మల్టీపర్పస్ ఉద్యోగులకు కారోబార్లగా ప్రత్యేక హోదా కల్పిస్తామని, కనీస వేతనం అమలు చేస్తామని చెప్పిన పాలకులు ఇప్పుడు ఆ ఊసే ఎత్తడంలేదని ఆరోపణలు ఉన్నాయి. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేస్తానని స్వయంగా మంత్రి సీతక్క హామీ ఇచ్చినా, ఆచరణలో మాత్రం అడుగు ముందుకు పడలేదు.
అరకొర జీతాలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న చిన్న ఉద్యోగులు, నెలల తరబడి జీతాలు రాకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఈ క్రమంలో గతంలో ఇద్దరు సిబ్బంది ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుడు నెల నెలా వేతనాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇచ్చిమ మాటను అమలుచేయడం లేదని కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బకాయి వేతనాలను విడుదల చేయాలని, ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో సంక్రాంతి తర్వాత సంఘాలుగా లేదా జేఏసీగా ఏర్పడి రాష్ట్రవ్యాప్త ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు.