హైదరాబాద్, జూన్4: స్పుత్నిక్ వీ, స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ల ఉత్పత్తిని 20 కోట్ల డోసులకు పెంచడానికి కట్టుబడి వున్నామని హెటిరో ఫార్మా సీఎండీ పార్థసారధిరెడ్డి స్పష్టంచేశారు. 10 కోట్ల డోసుల స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ల తయారీకి రష్యన్ డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్)తో కొద్దినెలల క్రితం ఒప్పందం కుదుర్చుకున్న హెటిరో ఇటీవల వాణిజ్య ఉత్పత్తిని కూడా ఆరంభించింది. ఈ నేపథ్యంలో జరిగిన ఒక రష్యన్ ఇన్వెస్ట్మెంట్ సదస్సులో ఆయన మాట్లాడుతూ తాము ఆర్డీఐఎఫ్తో కలిసి వాక్సిన్లకు సంబంధించిన టెక్నాలజీ బదిలీ, ఆర్ అండ్ డీ పరీక్షలు పూర్తిచేసి, అత్యాధునిక ప్లాంటులో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించామని, ఈ వాక్సిన్ అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు కలిగివుంటుందని హామీ ఇచ్చారు.