ముంబై, జనవరి 10: డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ మరో ఆల్‌టైమ్ కనిష్ఠానికి పడిపోయింది. శుక్రవారం ఒక్కరోజే 18 పైసలు దిగజారి మునుపెన్నడూ లేనివిధంగా 86 మార్కుకు ఎగువన 86.04 స్థాయికి క్షీణించింది. తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు, దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాలు, అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు.. రూపీని కూలదోశాయని ఫారెక్స్ ట్రేడర్లు చెప్తున్నారు. ఈ నెల 20న అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రానుండటంతో అగ్రరాజ్య వ్యాపారానుకూల నిర్ణయాలు పెద్ద ఎత్తున ఉంటాయన్న అంచనాల మధ్య డాలర్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిందని కూడా విశ్లేషిస్తున్నారు. కాగా, గతకొద్ది రోజులుగా క్రమేణా పడిపోతున్న రూపాయి పతనం.. భారతీయ దిగుమతులను మరింత భారం చేస్తుండగా, దేశ ఆర్థిక వ్యవస్థకూ కొత్త చిక్కుల్ని తెచ్చిపెడుతున్నది.
ఫారెక్స్ రిజర్వులు డౌన్
ఈ నెల 3తో ముగిసిన వారంలో దేశంలోని ఫారెక్స్ రిజర్వులు మరింతగా క్షీణించాయి. 5.693 బిలియన్ డాలర్లు దిగజారి 634.585 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా ప్రకటించింది. అంతకుముందు వారం కూడా 4.112 బిలియన్ డాలర్లు పడిపోయిన విషయం తెలిసిందే. కాగా, గత ఏడాది సెప్టెంబర్ ఆఖర్లో ఆల్‌టైమ్ హైని తాకు తూ ఫారెక్స్ నిల్వలు 704.885 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. కానీ మూడున్నర నెలల్లో 70 బిలియన్ డాలర్లు హరించుకుపోవడం గమనార్హం.