Rupee Vs Dollar | రూపాయి పతనం ఆగడం లేదు. గురువారం డాలర్‌తో పోలిస్తే రూపాయి ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయి 88.44కి పడిపోయింది. ఆసియాలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్‌పై అమెరికా సుంకాల ఒత్తిడి కారణంగానే రూపాయి విలువ పడిపోతుందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఆగస్టు నుంచి భారత్‌పై అమెరికా సుంకాలు విధించడంతో భారత్‌పై పెట్టుబడిదారుల నమ్మకాన్ని ప్రభావితం చేస్తున్నాయని రూపాయి పతనం చూపుతోందని.. ఆసియా దేశాలలో రూపాయి బలహీన స్థితిలో ఉండడానికి ఇదే కారణమని చెబుతున్నారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు విదేశీ పెట్టుబడిదారులు భారత స్టాక్ మార్కెట్ల నుంచి నికరంగా 11.7 బిలియన్ డాలర్లను ఉపసంహరించుకున్నారు.
గత శుక్రవారం రూపాయి 88.36 కనిష్ట స్థాయికి పడిపోయింది. యూఎస్ భారీ సుంకాలు భారతదేశ వృద్ధి, వాణిజ్యాన్ని దెబ్బతీశాయి. ఈ ప్రభావాన్ని తగ్గించడానికి భారత ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలు తీసుకువచ్చింది. ఈ క్రమంలోనే భారత్, యూఎస్ మధ్య వాణిజ్య అడ్డంకులు తొలగించేందుకు నిరంతరం చర్చలను పరిశీలిస్తున్నాయి. రూపాయి పతనం వేగాన్ని తగ్గించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకుంటోంది. సెంట్రల్ బ్యాంక్ మార్కెట్లో చురుగ్గానే వ్యవహరిస్తుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అస్థిరతను తగ్గించడానికి, ప్రధాన హెచ్చుతగ్గులను నివారించేందుకు ఆర్బీఐ డాలర్లను విక్రయిస్తోందని భావిస్తున్నారు. ఈ జోక్యం ఏదైనా నిర్దిష్ట స్థాయిని నిర్వహించడం కాదని.. క్షీణతను స్థిరంగా ఉంచడం ద్వారా కంపెనీలు, పెట్టుబడిదారుల ఆందోళనను తగ్గించడమని బ్యాంకర్లు పేర్కొంటున్నారు.