ముంబై, ఆగస్టు 8: దేశీయ కరెన్సీకి మరిన్ని చిల్లులు పడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో ఇతర కరెన్సీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ఫలితంగా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనిమిది నెలల కనిష్ఠ స్థాయి 82.91 పడిపోయింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఆటుపోటులకు గురికావడంతోపాటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను ఉపసంహరించుకోవడం కూడా రూపాయి పతనానికి ఆజ్యంపోశాయి. 82.80 వద్ద ప్రారంభమైన రూపాయి విలువ 82.78 నుంచి 82.93 స్థాయిలో కదలాడింది. చివరకు 16 పైసలు కోల్పోయి 82.91కి జారుకున్నది. ద్రవ్యోల్బణాన్ని 2 శాతానికి తగ్గించడానికి మరోసారి వడ్డీరేట్ల పెంపు తప్పదని అమెరికా ఫెడరల్ రిజర్వు అధికారి స్పష్టంచేయడంతో అంతర్జాతీయ మార్కెట్లలో అలజడి సృష్టించింది. మరోవైపు, దేశీయ స్టాక్ మార్కెట్లు పతనం చెందాయి 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 106.98 పాయింట్లు తగ్గి 65,846.50 వద్దకు పడిపోగా, నిఫ్టీ 26.45 పాయింట్లు కోల్పోయి 19,570.85 వద్ద నిలిచింది.