Rupee | ముంబై, డిసెంబర్ 27: కరెన్సీ పతనాన్ని అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. దీంతో రోజుకొక కనిష్ఠ స్థాయికి పడిపోతున్న విలువ శుక్రవారం ఏకంగా పాతాళంలోకి జారుకున్నది. ఇంట్రాడేలో 85.80 స్థాయికి పడిపోయిన డాలర్-రూపీ ఎక్సేంజ్ రేటు పతనాన్ని అడ్డుకోవడానికి రిజర్వుబ్యాంక్ అన్ని అస్ర్తాలను సంధించడంతో చివర్లో ఈ భారీ పతనాన్ని తగ్గించుకోగలిగింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీగా పుంజుకోవడం రూపాయి పతనానికి అడ్డుకట్టవేసింది.
85.31 వద్ద ప్రారంభమైన డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఇంట్రాడేలో 53 పైసలు కుంగి చారిత్రక కనిష్ఠ స్థాయి 85.80కి జారుకున్నది. సెంట్రల్‌బ్యాంక్ జోక్యంతో భారీ నష్టాల నుంచి కోలుకొని చివరకు 21 పైసల నష్టంతో 85.48 వద్ద ముగిసింది. గడిచిన రెండేండ్లలో ఒకేరోజు ఇంతటి స్థాయిలో పతనం చెందడం ఇదే తొలిసారి. ఫిబ్రవరి 2, 2023న రూపాయి విలువ అత్యధికంగా 68 పైసలు పడిపోయిన విషయం తెలిసిందే.